అయ్యా! ఇంతకీ మీరు ఏ పార్టీ?

Update: 2018-09-01 06:38 GMT
రాజకీయ పార్టీలకు ప్రజాదరణ ఎంత ముఖ్యమో ఆత్మవిశ్వాసం - ఆత్మగౌరవం కూడా అంతేముఖ్యం. కానీ, ఘనత వహించిన పార్టీలు కూడా ఇటీవల కాలంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా ఆత్మగౌరవాన్నీ అమ్ముకుంటూ నిన్నకాక మొన్న పుట్టిన పార్టీలను బలోపేతం చేసి వాటి వేలితో ఇతర పార్టీల కళ్లు పొడవాలని కలలు కంటున్నాయి. తాజాగా సీపీఎం నేత మధు వ్యాఖ్యలు చూస్తుంటే ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది... ? ఈ పార్టీ నేతలు అసలు ఆలోచించే మాట్లాడుతున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
    
ఏపీలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని సీపీఎం నేత మధు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లాలనుకుంటున్నారా లేదా అన్నది పక్కనపెడితే మధు అసలు సీపీఎం కోసం పనిచేస్తున్నారా లేదంటే జనసేన బలోపేతం కావాలని కోరుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినా - ప్రజాకంటక నిర్ణయాలు వెలువడినా కూడా వాటిని నిరసిస్తూ బలమైన ఉద్యమాలు నిర్మించలేకపోయిన సీపీఎం ఇప్పుడు జనసేన బలపడాలని కోరుకుంటూ ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చి చేరుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
    
దేశంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తిగా బలహీనపడిన సీపీఎం ఏపీలో జనసేన తోడు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అంతమాత్రాన మరీ ఇంతగా సొంత పార్టీ బలోపేతాన్ని మర్చిపోయి తాడూబొంగరం లేని జనసేన పార్టీలోకి జనాలు వచ్చే అవకాశం ఉందంటూ చంకలు గుద్దుకోవడం చూస్తున్నవారంతా ఇంతకీ వీరు సీపీఎం నేతలేనా అని ఆశ్చర్యపోతున్నారు. మధు సీపీఎంలో ఉన్నారా లేదంటే జనసేనలో చేరిపోతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News