పోలీసు అభ్యర్థుల్లో 300 మంది క్రిమినల్స్?

Update: 2020-01-14 06:56 GMT
షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయటం.. అందులో కొందరు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇలా ఎంపికైన అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిలో 300 మందికి నేరచరిత్ర ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. తమపై కేసులు ఉన్న విషయాన్ని వందల మంది అభ్యర్థులు దాచి పెట్టిన వైనం తాజాగా బయటకు వచ్చింది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. నేరచరిత్ర ఉన్న వారిలో అతి తీవ్రమైన నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు. పోలీసులకు అందుబాటులో ఉండే అత్యాధునిక సాంకేతికతతో ఈ లెక్కల్ని బయటకు తీశారు.

నేర చరిత్ర ఉన్న వారిలో పలువురు హత్య కేసులు.. ఫోక్సో కేసులు ఉన్న వారు కూడా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. నేరస్తులు పలువురు తమ నేరచరిత్రను దాచి పెట్టి పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నించగా.. అత్యాధునిక సాంకేతికత వారి గుట్టును రట్టు చేసింది. ఇప్పుడు వీరిపై చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు షురూ అయినట్లు తెలుస్తోంది. నేరచరిత్ర ఉన్న వారు ఎంపిక కావటం చూస్తే.. నియామకాలు సాగిన తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News