రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రాల నుంచే భారీగా క్రాస్ ఓటింగ్!

Update: 2022-07-22 02:08 GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూటమి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమెకు ముందుగా ఊహించిన దానికంటే అధికంగా ఓట్లు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షాల కూట‌మి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఆశించిన ఓట్లు కూడా రాలేదు. దీనికి భారీగా క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. య‌శ్వంత్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన పార్టీల్లోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ముర్ముకే ఓటేశార‌ని తెలుస్తోంది.

ఇలా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల నుంచి 125 మంది ఎమ్మెల్యేలు ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తుగా క్రాస్ ఓటింగ్ చేశార‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాగే 17 మంది విప‌క్ష కూట‌మికి చెందిన ఎంపీలు సైతం ముర్ముకే ఓటేశార‌ని అంటున్నారు. ముఖ్యంగా అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలలో గణనీయమైన సంఖ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ద్రౌప‌ది ముర్ముకే ఓటేశారని మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి.

అస్సాంలో 22 మంది, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. అలాగే బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఆరుగురు చొప్పున‌, గోవా నుంచి నలుగురు, గుజరాత్‌ నుంచి 10 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ద్రౌప‌ది ముర్ముకు ఓటేశార‌ని అంటున్నారు.

బీజేపీపై ఇష్టం లేక‌పోయినా ద్రౌప‌ది ముర్ము గిరిజన నేపథ్యంతో జార్ఖండ్ లోని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు సైతం ఆమెకు క్రాస్ ఓటింగ్ వేశారని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే బీజేపీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రించే జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా ఆమెకు ఎన్నిక‌లకు ముందే మద్దతు ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి గిరిజన రాష్ట్ర‌ప‌తిగా, అతి పిన్న వయస్కురాలైన రాష్ట్ర‌ప‌తి అయిన ద్రౌప‌ది ముర్ముకే జై కొట్టింది.

కాగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీల నుంచి ద్రౌప‌ది ముర్ము గరిష్ట ఓట్లను పొందారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ ద్రౌప‌ది ముర్ముకే మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో మొత్తం ఓట్ల‌న్నీ ఆమెకే ప‌డ్డాయి. అలాగే ఎస్టీలు ఎక్కువ‌గా ఉండే సిక్కిం, నాగాలాండ్ అసెంబ్లీల నుంచి కూడా ముర్ముకు మొత్తం ఓట్లు వచ్చాయి.

కేర‌ళ‌లో మాత్రం ఓట్ల‌న్నీ య‌శ్వంత్ సిన్హా కైవ‌సం చేసుకున్నారు. అలాగే బీజేపీ వ్య‌తిరేక పార్టీలు తృణ‌మూల్ కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్న‌ పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లోనూ సిన్హాకు అత్య‌ధిక ఓట్లు ప‌డ్డాయి.

కాగా క్రాస్ ఓటింగ్ విష‌యంలో తామెవ‌రినీ ఒత్తిడి చేయ‌లేద‌ని.. స్వ‌చ్ఛందంగానే ఆమెకు అనుకూలంగా అనేక పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటేశారని బీజేపీ నేత‌లు. కాంగ్రెస్ సహా విపక్ష కూటమిలోని అనేక పార్టీల ప్రజా ప్రతినిధులు ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటేసినట్టు వారు చెబుతున్నారు.
Tags:    

Similar News