ముడి చమురు తగ్గినా.. లీటరు పెట్రోల్ రూ.80?

Update: 2019-09-27 06:12 GMT
పెరగటమే కానీ తగ్గటం అలవాటే లేనట్లుగా పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని పైసలు పెరిగితే చాలు.. లీటరు పెట్రోల్ ధర 80రూపాయిలకు చేరుకోనుంది. లీటరు డీజిల్ ధర కూడా రూ.75కు దగ్గరకు వచ్చేసింది. ఈ పరిస్థితి హైదరాబాద్ ఒక్క చోటే కాదు.. దేశంలోని అన్ని నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల కారణంగా ముడిచమురు ధర పెరగటంతో.. ఆ లోటును సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా పెట్రోల్.. డీజిల్ ధరల్నిఅంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు చొప్పున పెరిగితే.. డీజిల్ ధర 10 పైసలు పెరిగింది. పది పైసలు.. పదిహేను పైసలు పెరిగిన దానికే ఇంతలా విరుచుకుపడితే ఎలా? అన్న ప్రశ్న మదిలో రావొచ్చు. కానీ.. ఇలా పైసలు చొప్పున నిత్యం పెరుగుతున్న కారణంగానే ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్ లో రూ.79.02 చేరుకున్న విషయాన్ని మర్చిపోకూడదు. మొన్నటివరకూ రూ.70లోపే ఉన్న లీటరు డీజిల్ ధర తాజాగా రూ.73.29కు చేరుకుంది. 

ఇక్కడో విచిత్రమైన విషయం చెప్పాలి. మన దగ్గర పెట్రోల్.. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతుంటే.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గుముఖం పట్టింది. మధ్య ప్రాచ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతున్నట్లుగా చెబుతున్న ఇంధన సంస్థలు.. మరిప్పుడు ముడిచమురు తగ్గుతున్నా.. ధరల్ని ఎందుకు పెంచుతున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్ 61.23 డాలర్లకుతగ్గితే.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ 56.19 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నాయి? మరి.. అందుకు తగ్గట్లే మన పెట్రోల్.. డీజిల్ ధరలు ఎప్పటికి తగ్గేను?


Tags:    

Similar News