పూల కుండీల్లో గంజాయి సాగు .. నగరం నడిబోడ్డునే !

Update: 2021-11-08 05:51 GMT
గంజాయి సాగు, రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోని గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఈ మధ్యనే సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా నగరంలోకి సరిహద్దుల్లో నుండి వస్తుందని అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. గంజాయి కేవలం సరిహద్దుల నుంచి మాత్రమే వస్తోందని ఇన్నాళ్లూ భావించారు పోలీసులు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచి మరీ అమ్మేస్తున్న విషయాలు తెలుసుకొని అవాక్కవుతున్నారు.

పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నాయి. కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కొందరు మారట్లేదు. గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇంట్లోని పూల కుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచి విక్రయిస్తున్న ఓ ముఠాను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ యాప్రాల్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాప్రాల్‌ లో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీనితో గోదావరి గార్డెన్‌ లో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఏడు పెద్ద కుండీల్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక యువకులకు ఈ గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఓవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, మరోవైపు సైడ్ బిజినెస్ కింద ఇలా ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు.

ఇదే తరహా ఘటన శంషాబాద్ లో కూడా 2 రోజుల కిందట బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజ్ పుత్ రోజు కూలీ. కొన్నేళ్లుగా ఇతడికి గంజాయి అలవాటు ఉంది. దీంతో తన సొంతానికి ఇంట్లోనే ఓ గంజాయి మొక్క పెంచుకున్నాడు. 4 నెలలుగా మొక్క కింది భాగం నుంచి ఆకులు తెంచుతూ, దాన్ని ప్రాసెస్ చేసి సొంతంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. మొక్క బాగా పెరిగి అందరికీ కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి అతగాడ్ని అదుపులోకి తీసుకున్నారు


Tags:    

Similar News