క‌రెన్సీ క‌ష్టాల గడువు పెరిగింది!

Update: 2016-12-15 05:16 GMT
రూ.500 - రూ.1000నోట్ల రద్దు అనంతరం నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ 50 రోజులు ఓపిక పట్టండి.. అంతా సర్దుకొంటుందని భరోసా ఇచ్చిన సంగ‌తి మ‌నంద‌రికి గుర్తుండే ఉంటుంది. అయితే చ‌లామ‌ణీలో ఉన్న 86శాతం నగదు ఒక్కసారిగా రద్దు కావడం.. ఆర్థిక ఆంక్షలు విధించడంతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. బ్యాంకులు - ఏటీఎంల వద్ద భారీ క్యూ లైన్లు తప్పడంలేదు. ఇప్పటికే 36 రోజులు గడిచిపోయాయి. ఇక మిగిలింది 14 రోజులే! ఈ నేపథ్యంలో నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులు ఇంత తక్కువ సమయంలో సర్దుకోవడం అసాధ్యమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

9లక్షల కోట్ల రూపాయలను చెలామణిలోకి తేవాలంటే ముద్రణ, రవాణా పూర్తికావాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ అవుతుంది. ఇక 14లక్షల కోట్లు అందుబాటులోకి తేవాలని భావిస్తే.. వచ్చే ఏడాది ఆగస్టు కావాల్సిందే!! ఇందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి.

-దేశంలో నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌ లు దెవాస్ (మధ్యప్రదేశ్) నాసిక్ (మహారాష్ట్ర) - సల్బోని (పశ్చిమబెంగాల్) - మైసూరు (కర్ణాటక) ఉన్నాయి.

-ఈ ప్రింటింగ్ ప్రెస్‌ లకు ఏడాదికి 2,670 కోట్ల నోట్లు ముద్రించే సామర్థ్యం ఉన్నది. ఆర్బీఐ వార్షిక నివేదిక-2016 ప్రకారం ఈ నాలుగు ప్రెస్‌ లు రోజుకు 7.4కోట్ల నోట్లు ముద్రిస్తాయి.

-మూడు షిఫ్టులు పనిచేస్తే రోజుకు 11.1కోట్ల నోట్లు ముద్రించవచ్చు.

-ఈ ప్రింటింగ్ ప్రెస్‌ ల్లోని మిషన్లలో సగం మాత్రమే రూ.500 ఆపై నోట్లు ముద్రించే సామర్థ్యం కలిగినవి.

-ఈ నేపథ్యంలో నాలుగు ప్రింటింగ్ ప్రెస్‌ లు ఏకకాలంలో పనిచేస్తే రోజుకు 5.56 కోట్ల నోట్లు ముద్రించవచ్చు.

-ఒక రోజు రూ.500విలువ గల నోట్లు ముద్రిస్తే రూ.2,778కోట్లు అందుబాటులోకి వస్తాయి.

-నోట్ల రద్దు నిర్ణయానికి ముందే ప్రభుత్వం 200 కోట్ల రూ.2వేల నోట్లను ముద్రించింది. వాటి విలువ రూ.4లక్షల కోట్లు. అందువల్లనే నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆ నోట్లు అతి త్వరగా చెలామణిలోకి వచ్చాయి.

-ప్రభుత్వం రద్దు చేసిన నోట్లలో 35శాతం తక్కువ నోట్లను (రూ.9లక్ష కోట్లు) కొత్తగా ముద్రించాలని భావిస్తున్నది. అదే జరిగితే రూ.2వేలు - రూ.500 - రూ.100 - రూ.50 - రూ.20 - రూ.10 విలువ గల నోట్లు ముద్రణ
పూర్తిచేసుకొని.. వచ్చే ఏడాది ఏప్రిల్‌కల్లా అందుబాటులోకి వస్తాయి.

-ప్రభుత్వం రద్దు చేసిన నోట్ల స్థానంలో పూర్తిస్థాయి కొత్తనోట్లను అందుబాటులోకి తేవాలని భావిస్తే.. రూ.14లక్షల కోట్లు విలువైన కొత్తనోట్లు ముద్రించడానికి వచ్చే ఆగస్టు వరకు సమయం పట్టనున్నది.

-ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.100 - రూ.50 - రూ.20 - రూ.10 విలువగల నోట్లను రూ.2.19లక్షల కోట్లు ముద్రించనున్నది.

-ఆర్బీఐ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అవసరమైన రూ.500నోట్ల ముద్రణ వచ్చే ఏడాది మార్చి 10కల్లా లేదా జూలై 8 కల్లా పూర్తికానున్నది.

-ప్రింటింగ్ ప్రెస్‌ లో ముద్రణ పూర్తి చేసుకొన్న నోట్లు ఆర్బీఐ ప్రాంతీయ శాఖలు అక్కడినుంచి బ్యాంకు ప్రధాన కార్యాలయాలు - బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలు - చివరికి బ్యాంకు శాఖలు - ఏటీఎంలు.. వాటి ద్వారా ఖాతాదారుడికి చేరడానికి రవాణా - పంపిణీ ప్రక్రియ పూర్తికావడానికి 2017 ఏప్రిల్ కానున్నది. సో క్యాష్ కష్టాలు తీరడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందేనన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News