సీట్లో కూర్చోక‌ముందే అమ్మ‌కు ట్ర‌బుల్స్ స్టార్ట్‌

Update: 2016-05-20 10:12 GMT
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పురుచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత తాజాగా ద‌క్కిన సీఎం పీఠం ఒకింత క‌ష్టాల‌తోటే ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఫ‌లితాలు వ‌చ్చిన రోజు నుంచే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ప‌డుతున్నాయి. తీవ్ర వాయుగుడం ప్రభావంతో మళ్లీ కురుస్తున్న వర్షాలు చెన్నై ప్రజల్లో అందోళన కలిగిస్తోంది. గత రెండు నెలలుగా వేసవి ప్రతాపంతో అల్లాడిపోయిన జనం సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో కాస్త సేదతీరారు. అయితే ఈ వర్షం మామూలు వర్షం కాదని, వాయుగుండమై నగరానికి పెద్దగండంగా మారబోతుందని వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలతో జనం బెంబేలెత్తుతున్నారు. గత ఏడాది నవంబర్ - డిసెంబర్‌ లో నగరంలో బీభత్సకాండ సృష్ట్టించిన వర్షాల చేదు జ్ఞాపకాలను జనం ఇంకా మరచిపోకముందే మళ్లీ మరో వర్షగండం కాచుకుకూర్చుని ఉండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు.

శ్రీలంక - తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా బలపడింది. చెన్నై- పులికాట్‌ ల మధ్య 230 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఏ క్షణమైనా తీరాన్ని దాటడానికి సిద్ధంగా ఉంది. దాంతో చెన్నై - తిరువళ్లూరు - కాంచీపురం - తిరువణ్ణామలై జిల్లాల్లో వర్షం కుండపోతలా కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. చెన్నైలో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు జల మయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గత ఏడాది వర్షాల సమయంలో చెన్నైని ముంచెత్తిన చెంబరంబాక్కం రిజర్వాయర్ ఇప్పుడు మరోసారి భయపెడుతోంది. వ‌రుస‌గా రెండ్రోజుల పాటు ఈ ప్రాంతంలో భారీవర్షం కురిసింది. దాంతో జలాశయంలోని భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. గత ఏడాది వర్షాల సమయంలో ఈ జలాశయం గేట్లను అర్ధరాత్రి ఎత్తేయడంతో అడ యారు పొంగిపొర్లడం - దక్షిణ చెన్నైలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకు పోవడం జనాల్ని భీతావహుల్ని చేశాయి. ఈ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడం కూడా అప్పట్లో పెనుదుమారం సృష్టించింది. దాంతో ఈసారి ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌ ను నిశితంగా గమనిస్తోంది. జలాశయంలోకి వచ్చి చేరుతున్న నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది.

మరోవెపు చెన్నై - కాంచీపురం - తిరువళ్లూరు - తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా విపత్తులు ఏర్పడితే ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉండాలని హెచ్చరించింది. సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే వర్షాల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెన్నై శివార్లలోని రిజర్వాయర్ల వద్ద పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు అందాయి. వాయుగుండం తీరాన్ని దాటే సమ యంలో భారీ వర్షాలు కురిసే సూచనలుండటంతో యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది.రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. జాలర్లు చేపల వెళ్లకుండా పడవలను తీరాన్నే ఉంచేశారు. అక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దక్షిణాది జిల్లాల్లో పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా ప్ర‌మాణ‌స్వీకార ఏర్పాట్ల కంటే వ‌ర‌ద బీభ‌త్సంపైనే అమ్మ దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం వ‌స్తోంద‌ని అధికారులు అంటున్నారు.
Tags:    

Similar News