అధికారికం 89.. అనధికారికం వందకు పైనే

Update: 2015-09-13 03:58 GMT
శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మొబైల్ మోగింది. పుష్ నోటిఫికేషన్ రింగ్ టోన్ రావటం.. ఏమైందా? అన్న ఆసక్తితో తెరిచి చూస్తే.. షాకింగ్. మధ్య ప్రదేశ్ లోని ఒక రెస్టారెంట్ లో గ్యాస్ బండ పేలి 20 మందికి పైగా మృతి అన్న సమాచారం షాకిచ్చింది.

అలా మొదలైన ఈ ఘోర దుర్ఘటన శనివారం రాత్రి నాటికి 89 మందిని బలి తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తే.. వంద మందికి పైగా గాయాలు అయినట్లు తేల్చారు. శిధిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య భారీగా ఉందని.. దీంతో.. మరణాలు మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య వందకు పైనే ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఇంత భారీ ఘోరం ఎలా జరిగింది? అందుకు కారణం ఏమిటి? మరణించిన వారెవరూ? విధ్వంసం తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయాల్ని చూస్తే..

అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ లోని ఝబువా జిల్లా పెట్లావద్ పట్టణంలోని రద్దీ ప్రాంతంలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. రాతి ప్రాంతాల్లో బావులు తవ్వేందుకు రాజేంద్ర కసావా అనే వ్యక్తి నివాసంలో ఉన్న భారీ జెలిటిన్ స్టిక్ లు పేలిపోవటమే ప్రమాదానికి కారణం. అయితే.. జెలిటిన్ స్టిక్ లు కలిగి ఉండేందుకు రాజేంద్రకు లైసెన్స్ ఉంది. అయితే.. రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాల్ని భారీగా నిల్వ ఉంచటం అక్రమం అని చెబుతున్నారు.

మృతుల సంఖ్య ఎందుకింత భారీగా..

ప్రమాద వశాత్తు ఈ జెలిటిన్ స్టిక్ లు పేలటంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది.  దీనికితోడు ఈ పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం వాణిజ్య.. నివాస ప్రాంతం కావటం.. బస్లాండ్ కు దగ్గరగా ఉండటం ఒక కారణం. దీనికి తోడు పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఒక ప్రముఖ హోటల్ ఉంది. ఇక్కడకు టిఫిన్లు చేసేందుకు పెద్ద సంఖ్యలో వేచి ఉండటం. ఉదయమే కావటంతో టిఫిన్ కోసం వచ్చే వారితో నిండి ఉన్న సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. అంతేకాదు.. గుజరాత్ వెళ్లటానికి బస్సుల కోసం వేచి చూస్తున్న వారు.. కూలి పని కోసం ఉన్న వారు పెద్ద ఎత్తున అక్కడే నిలబడి ఉండటం ఇంత భారీ నష్టానికి కారణాలు.

షట్టర్ ఎత్తటమే శాపమా?

మొదట బాణసంచా పేలుడు శబ్దం మాదిరి చోటు చేసుకుందని.. అంత భారీగా శబ్దం రావటంతో ఉలిక్కిపడ్డ వారిలో కొందరు పరుగులు తీస్తే.. మరికొందరు అలానే నిలబడిపోయారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో షట్టర్ తెరిచారని.. దాంతో.. పేలుడు తీవ్రత భారీగా బయట ఉన్న వారిని తాకిందంటున్నారు. ఒకవేళ.. ప్రమాదం జరిగిన చోట షట్టర్ తీయకుంటే ఇంత జననష్టం వాటిల్లేది కాదన్న వాదన ఉంది.

పేలుడు తీవ్రత ఎంతంటే..?

పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే.. భారీ శబ్ధంతో పాటు.. రెండు భవనాలు కూలిపోయాయి. విస్పోటనం చోటు చేసుకున్న సమయంలో మనుషులు శరీర భాగాలు ముక్కలు.. ముక్కలుగా గాల్లోకి ఎగిరిపడటం కొందరు చూశారు. ఈ ఘోర ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉన్న వారి మాటలు వణుకు పుట్టించేలా ఉన్నాయి.

చాలామంది చిక్కుకుపోయారా?

శనివారం రాత్రికి ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య అధికారికంగా 89 మంది. అయితే.. భవనం కూలిపోయిన శిధిలాల కింద బాధితుల సంఖ్య భారీగా ఉంటుందని భావిస్తున్నారు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతంలోనే 20 మృతదేహాలు లభ్యమైనట్లు చెబుతున్నారు.

మృతి చెందిన వారెవరు?

ఈ ఘటనలోమృతి చెందిన వారిలో.. పేలుడు సంభవించిన భవనంలో ఉన్న వారు.. భవనం బయట బస్సుల కోసం వెయిట్ చేస్తున్న వారు.. భవనం పక్కనే ఉన్న హోటల్ లో టిఫిన్ చేస్తున్న వారు.. కూలి పని కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటారని భావిస్తున్నారు.
Tags:    

Similar News