చింత‌మ‌నేని బాధితురాలు వ‌న‌జాక్షికి కీల‌క ప‌ద‌వి

Update: 2019-09-24 12:30 GMT
తహశీల్దార్ వనజాక్షి...ఈ పేరు చెప్పగానే దెందులూరు మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ చేసిన దాడే గుర్తొస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమేని అరాచకాలకు వనజాక్షి కూడా బాధితురాలే. అప్పుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వనజాక్షిపై చింతమనేని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రభాకర్ మాత్రం గొడవ జరుగుతుంటే తాను వెళ్లానని - ఆమెపై దాడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ వివాదం అక్కడితో ఆగకుండా చంద్రబాబు వరకు వెళ్లింది. ఆయన ఇద్దరిని పిలిపించి మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

చింత‌మ‌నేని స్వ‌యంగా ద‌గ్గ‌రుండి మ‌రీ దాడి చేయించినా బాబు మాత్రం త‌మ పార్టీ ఎమ్మెల్యేకే వ‌త్తాసు ప‌లికార‌న్న‌ది నిజం. ఈ వివాదం పెద్ద‌ది కాకుండా చంద్ర‌బాబు ఎంత చేసినా సరే ఆ మచ్చ టీడీపీకి గానీ - చింతమనేని మీద గానీ పోలేదు. వైసీపీ దీన్నే ఆయుధంగా మలుచుకుని ఎన్నికల ముందువరకు చింతమనేని - టీడీపీపై విమర్శల వర్షం గుప్పించింది. అయితే దీనితో పాటు, అనేక విమర్శలు రావడంతో చింతమనేని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక చింతమనేని ఓటమికి చాలావరకు కారణమైన తహశీల్దార్ వనజాక్షి పేరు...మళ్ళీ మీడియాలో వచ్చింది.

తాజాగా వనజాక్షి ఆంధ్రప్రదేశ్ తహశీల్దార్ల అసోసియేషన్ (ఆప్టా) గౌరవాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా చినకాకానిలో తహశీల్దార్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆప్టా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆప్టా అధ్యక్షుడిగా బీ రజినీకాంత్ ను ఎన్నుకున్నారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా వీ శ్రీనివాసులరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పీ భాస్కరరావు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వనజాక్షి విజయవాడ రూరల్ తహశీల్దార్‌ గా పని చేస్తున్నారు. ఆమె గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి స‌మీప బంధువు అవుతారు. గ‌తంలో కృష్ణా జిల్లా ముసునూరు త‌హ‌సీల్దార్‌ గా ప‌నిచేస్తున్న‌ప్పుడే ప్ర‌భాక‌ర్ ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు.
Tags:    

Similar News