పుట్టే ప్రతీ బిడ్డ మీద 1.20 లక్షల అప్పు...?

Update: 2022-03-13 10:55 GMT
అప్పుల ఆంధ్రా. ఈ మాట విని ఎవరు నొచ్చుకున్నా ఇదే నిజం అంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఇపుడు ఇదే మాటను విపక్షాలు సైతం గట్టిగా చెబుతున్నాయి. ఏపీని పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత వైసీపీ సర్కార్ పెద్దలకే దక్కింది అని బీజేపీ నాయకురాలు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. ఏపీలో గత రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దివాళా తీయించేశారు అని ఆమె విమర్శించారు. ఆఖరుకు పుట్టే ప్రతీ బిడ్డ మీద 1.20 లక్షల అప్పు పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు.

విశాఖ టూర్ లో ఆమె వైసీపీ సర్కార్ మీద ఒక్క లెక్కన  ఫైర్ అయ్యారు. ఈ రోజున  ఏపీలో అభివృద్ధి ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. ఇక వైసీపీ సర్కార్ పెద్దలు ఎక్కడ అప్పు దొరుకుతుందా అని ప్రతీ రోజూ  ఎదురుచూస్తున్నారని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అప్పు ఎంత అయినా తెచ్చేసేందుకు  రెడీగా ఉన్నారని ఆమె మండిపడ్డారు.

అఖరుకు అప్పుల కోసం ఏపీలో భూములను కూడా తాకట్టు పెడుతున్నారని పురంధేశ్వరి అన్నారు.  మెగా సిటీ అయిన విశాఖలోని  భూములను కూడా తాకట్టు పెట్టడం దారుణమని, ఇలాంటి దుస్థితి ఏపీలో ఉంది అంటే బాధ కలుగుతోందని ఆమె అన్నారు. అప్పులు  తెచ్చి ఏపీని అధోగతిపాలు చేస్తున్న వైసీపీ నేతలు బీజేపీ మీద అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.

రాష్ట్రానికి కేంద్రం నిధులు సరిగ్గా ఇవ్వడంలేదని అనడం కంటే అబద్ధం వేరేదైనా ఉంటుందా అని ఆమె నిలదీశారు. కేంద్రం డబ్బులు ఇస్తేనే తప్ప ఒక్క పూట గడవని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆమె ఎద్దేవా చేశారు.  కేంద్రం ఏపీలోని రోడ్లకు గానూ 25 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇన్నేసి వేల కోట్లు కేంద్రం ఇస్తూంటే ఏపీ సర్కార్ మాత్రం గుప్పెడు మట్టి కూడా రోడ్లకు వేయడంలేదని అన్నారు.

ఏపీలో వైసీపీ పాలన అసలు బాగులేదని, ప్రజలు కూడా ఆల్టర్నేషన్ కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఏపీకి కొత్త నాయకత్వం కావాలని, దాన్ని అందించాల్సిన బాధ్యత బీజేపీ తీసుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఉత్తరాదిన నాలుగు రాష్ట్రాలలో గెలిచిన బీజేపీ ఇక ఏపీ మీద దృష్టి పెట్టిందని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయఢంకా మోగించాల్సిందే అని ఆమె కోరారు. మొత్తానికి ఏపీలో పాలన  అప్పుల తప్పుల తడక అని  వైసీపీ సర్కార్ ని పురంధేశ్వరి ఒక దుమ్ము దులిపేశారు.




Tags:    

Similar News