అదేంది దానం.. ఆ ప‌ని పోలీసులు చేస్తారుగా?

Update: 2017-07-25 09:01 GMT
ఎవ‌రేం ప‌ని చేయాలో వారు ఆ ప‌ని చేయాలి. చ‌ట్టాన్ని ఎవ‌రూ త‌మ చేతుల్లోకి తీసుకోకూడ‌దు. కానీ.. సీనియ‌ర్ నేత‌గా.. మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం బ‌ర్నింగ్ ఇష్యూగా ఉన్న డ్ర‌గ్స్ విచార‌ణ అంశంపై ఆయ‌న విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్న ప‌బ్బుల‌పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మెరుపుదాడులు చేస్తామ‌ని దానం నాగేంద‌ర్ పేర్కొన‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ప‌బ్బుల‌ను నియంత్రించ‌కుండా.. త‌మ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయంటూ వార్నింగ్ ఇవ్వ‌టం విశేషం.

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ చేస్తున్న అధికారుల‌పై ఒత్తిడి త‌గ‌ద‌న్న దానం.. త‌మ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించ‌కుండా మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం త‌గ‌ద‌న్నారు. ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తున్న మంత్రి కేటీఆర్‌.. ఒక పెద్దాయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ ఎందుకు జ‌రిపించ‌ర‌ని సూటిప్ర‌శ్న వేశారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబ‌రు 36లోని ఒక టెర్ర‌స్ మీద  ప‌బ్ న‌డుపుతున్నార‌ని.. అది పూర్తిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌న్నారు. డ్ర‌గ్స్ కేసు తెర మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత ప‌లువురు త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గురి అవుతున్న‌ట్లుగా చెప్పారు. డ్ర‌గ్స్ విచార‌ణకు సంబంధించి సినిమా సెల‌బ్రిటీల పేర్లు మాత్ర‌మే ఎందుకు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయంటూ సందేహాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. సినిమా వాళ్ల పేర్ల‌తో స‌మ‌స్య‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

డ్ర‌గ్స్ కేసును విచారిస్తున్న అధికారుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌ని చెప్పిన దానం.. త‌మ‌పార్టీ నేతృత్వంలో రూల్స్‌ను బ్రేక్ చేసే ప‌బ్ లపై దాడులు చేయ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని.. లేనిపోని కేసుల్లో చిక్కుకోవ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని గుర్తు ఉంచుకుంటే మేలు. అయినా.. చాలాకాలం మంత్రిగా ప‌ని చేసిన దానంకు ఈ చిన్న విష‌యం ఎందుకు మిస్ అయిన‌ట్లు?
Tags:    

Similar News