రాత్రి గులాబీతో మీటింగ్ పగలువారితో కౌగిలింత

Update: 2015-12-05 04:57 GMT
మాజీ మంత్రి.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ పరిస్థితిని ఒక్క మాటలో చెబితే ఇలానే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ తర్వాత జరగనున్న గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ను పెద్ద ఎత్తున చేపడుతున్న తెలంగాణ అధికారపక్షం ధాటికి పెద్ద పెద్ద నేతలు తమ దారిని తాము పోతున్న పరిస్థితి. ఈ జాబితాలో తాజాగా దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

గురువారం రాత్రి విషయమే తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక నేతలైన డి శ్రీనివాస్ ఇంట్లో మంత్రలు హరీశ్ రావు.. జగదీశ్వర్ రెడ్డి.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులతో దానం నాగేందర్ భేటీ అయ్యారు. దీంతో.. ఒక్కసారిగా దానం నాగేందర్ కాంగ్రెస్ ను వీడిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపించింది.

ఇక.. శుక్రవారం ఉదయం దానం నాగేందర్ తన ముఖ్య అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా దానం పార్టీ మారే సమయం ఆసన్నమైందంటూ అంచనాలు వ్యక్తమయ్యాయి. దానం.. పార్టీని వీడిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపించింది. అయితే.. తాను పార్టీని విడిచి పెట్టటం లేదని.. గతంలో చెప్పినట్లుగానే తాను పార్టీలో కొనసాగుతానని దానం చెప్పటంతో.. అప్పటివరకూ వినిపించిన అంచనాలు తేలిపోయాయి.

ఒకవేళ కాంగ్రెస్ లో కొనసాగాలన్నదే దానం కోరిక అయితే.. ఆయన గురువారం రాత్రి టీఆర్ ఎస్ కీలక నేతలతో ఎందుకు భేటీ అయినట్లు? అన్నది ప్రశ్న. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పార్టీ మారాలని దానం నాగేందర్ భావించినప్పటికీ.. అనుకోని అవాంతరాలే ఆయన కాంగ్రెస్ నుంచి వీడిపోకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. తాను పార్టీలోకి రావటానికి కొన్ని షరతుల్ని విధించటం.. దానిపై టీఆర్ఎస్ సానుకూలంగా లేకపోవటమే తాజా పరిస్థితి కారణంగా చెబుతున్నారు.

పార్టీ మారాలని దానం మెంటల్ గా సిద్ధమయ్యారని చెబుతున్నారు. అయితే.. దానం కోరుకున్న రీతిలో గులాబీ బ్యాచ్ నుంచి ప్రతిస్పందన లేకపోవటంతో దానం వెనక్కి తగ్గినట్లుగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలను వీలైనంతవరకూ దెబ్బ తీయాలన్న ఆలోచనలో ఉన్నతెలంగాణ అధికారపక్షం దానం విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. దానం పార్టీని వీడటం పక్కా అని.. కాకుంటే ఎప్పుడన్న విషయంలో మాత్రం పలు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మధ్యహ్నం దానం నాగేందర్ చెప్పినట్లుగా తాను కాంగ్రెస్ ను వీడిపోవటం లేదన్న మాట వాస్తవవమే అయితే.. గురువారం రాత్రి గులాబీ గూట్లో సీరియస్ సమాలోచనలు ఎందుకు చేసినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News