స్పీడు పోయింది.. ని'దానం' మిగిలింది

Update: 2016-01-12 07:31 GMT
కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ అంటే హైదరాబాద్ లో మంచి పట్టున్న నేత. మందీమార్బలం.... ఆ లెక్కే వేరు. కాంగ్రెస్ మాస్ లీడర్లలో దానం పేరు టాప్ లో ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు. గల్లీ స్థాయి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినా హైదరాబాద్ లో కీలక నేతగా ఎదిగి మంత్రి పదవులు దక్కించుకుని ఢిల్లీ నేతలకూ ప్రీతిపాత్రుడయ్యారాయ. ప్రస్తుతం టైం బ్యాడై మళ్లీ ఖైరతాబాద్ గల్లీలకే పరిమితం అవుతున్నారు.

దానం నాగేందర్ కు సొంత పార్టీలోనే పరాభవాలు ఎదురవుతున్నాయి.   టీఆర్ ఎస్ లోకి వెళ్లబోయి ఆగిపోయిన ఆయనకు సొంతపార్టీలోని నాయకులే చుక్కలు చూపిస్తున్నారు. ఉప్పల్ లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను తరిమితరిమి కొట్టారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ దానంను పూర్తిస్థాయిలో నమ్మడం లేదని తెలుస్తోంది. దానం ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా… ఎన్నికలు అయిపోయాక టీఆర్ ఎస్ లో చేరతాడని హస్తం నేతలు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా.. కేవలం ఖైరతాబాద్ కు మాత్రమే పరిమితం చేసింది. అంతటితో ఆగని పీసీసీ దానంను ఇతర డివిజన్లలో జోక్యం చేసుకోవద్దని కూడా సూచించిందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేమీ లేక దానం కూడా సైలెంట్ గా ఉన్నారట. ఖైరతాబాద్ లోనైనా తన సత్తా చాటి భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని దానం చూస్తున్నారట. అయితే టీఆర్ ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ ను దానం వదులుకున్నారని.. అప్పుడే టీఆర్ ఎస్ లో చేరి ఉంటే గ్రేటర్ లో అధికారపార్టీ నుంచి హవా కొనసాగించేవారని కార్యకర్తలు వాపోతున్నారట. మొత్తం మీద గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం పీసీసీ మాట విని సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతారా? లేదా గ్రేటర్ మొత్తం బాధ్యతలు భుజాన వేసుకుంటారా అన్నది చూడాలి.
Tags:    

Similar News