పార్ల‌మెంట్ బ‌రిలో దానం...హామీ వ‌చ్చేసింది

Update: 2018-06-23 17:15 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారం కోసం ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్‌ కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జీహెచ్‌ సీసీ) మాజీ అధ్యక్షుడు - మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి - పార్టీ తెలంగాణ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్‌ కు విడివిడిగా లేఖలు రాశారు. దీంతో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హుటాహుటిన దానం నాగేందర్ నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. తొందరపడవద్దని - పార్టీకి భవిష్యత్ ఉందని - వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ నచ్చజెప్పబోయారు. అయితే దానం మాత్రం ఉత్తమ్ మాటలను పట్టించుకోలేదు. గుడ్ బై చెప్పేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఇందుకు కీల‌క కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది.

మ‌రుస‌టి రోజైన శ‌నివారం మీడియాతో దానం నాగేంద‌ర్ మాట్లాడుతూ టీఆర్ ఎస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇచ్చారు. గులాబీ పార్టీలో చేరనున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వీడడానికి గల కారణాలను వెల్లడించారు. ఏ పార్టీ చేయని విధంగా.. టీఆర్ ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కేసీఆర్ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ - మత్స్యకారులకు చేపల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు - రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. షాదీముబారక్ - కల్యాణలక్ష్మీ పథకాలు బడుగు బలహీన కులాల్లో వెలుగులు నింపుతుందని దానం పేర్కొన్నారు. టీఆర్ ఎస్ పార్టీలో చేరిన తర్వాత పదవులను ఆశించను. ఏ పని అప్పజెప్పినా బీసీల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

దానం చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికలప్పుడు ఆయన తప్పించినప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు ఆ పదవి తిరిగి ఇవ్వకపోగా, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్ యాదవ్‌ కు ఇవ్వడంపై దానం రగిలిపోతున్నారు. ఇక కాంగ్రెస్‌ లో కొనసాగడం దేనికని భావించిన దానం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌ సభకు టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆ మేరకు ఆ పార్టీ నాయకత్వంతో నాగేందర్ మాట్లాడుకునే ఉంటారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అప్పుడు సికింద్రాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కూడా బరిలో ఉంటారు. అదే నిజమైతే కాంగ్రెస్ - టీఆర్ ఎస్ - బీజేపీ మధ్య రసవత్తర పోటీ ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News