వైఎస్ లాంటి ద‌మ్మున్నోడు ఉండి ఉంటే....

Update: 2018-06-23 08:09 GMT
తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ప్రకంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ఎవ‌రి ఆధిప‌త్యాన్ని ఎవ‌రు అంగీక‌రించ‌కుండా అలా సాగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ కు పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఒక ఆటంకం అయితే, అధికారంలో ఉన్న‌ కేసీఆర్ మ‌రో ఆటంకం. కేసీఆర్ వంటి వ్య‌క్తి మీద గెల‌వ‌గ‌లిగిన నాయ‌క‌త్వం కాంగ్రెస్‌ లో క‌ర‌వ‌నే చెప్పాలి. ఇది చాలాక తాజాగా కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుల్లో ఒక‌రైన దానం నాగేంద‌ర్ రాజీనామా చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రినీ పేరు పెట్టి డ్యామేజ్ చేయ‌కుండా దానం రాజీనామా చేయ‌డం కొస‌మెరుపు. పైగా పోతూ పోతూ పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డికి మంచి మార్కులు వేసి పోయారు. ఆయ‌న‌కు ఏదైనా చేయాల‌ని ఉంద‌ని... కానీ ఆయ‌న‌ను అడ్డుకునే వారు పార్టీలో ఎక్కువైపోయార‌ని అన్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి... ఒక శిక‌రం అని, ఆయ‌న వంటి నేత కాంగ్రెస్‌ లో ఒక్క‌రూ లేరన్నారు. వైఎస్ పార్టీ నుంచి ఎక్స్‌ పెక్ట్ చేసే వ్య‌క్తి కాద‌ని - పార్టీకి ఏదైనా ఇచ్చే వ్య‌క్తి అన్నారు. పార్టీని కాపాడగ‌లిగే ధైర్యం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కి త‌ప్ప ఇంకొక‌రు లేర‌ని అన్నారు. వైఎస్‌ కు ఏదైనా నేరుగా చెప్పే చ‌నువు త‌న‌కుంద‌ని, ఏదైనా చెప్పినా వైఎస్ ప‌ట్టించుకునేవార‌న్నారు. వైఎస్ అనంత‌రం పార్టీలో పార్టీని ఎవ‌రూ పైకి తీసుకురారు. తీసుకురానివ్వ‌రు అని దానం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలు మారి వ‌చ్చినోళ్ల‌కు ప్రాధాన్యం ఉంది గాని.. పార్టీ ప్రతిష్ట కాపాడే వాళ్ల‌కు ఇంపార్టెన్స్ ఉండ‌టం లేద‌న్నారు. ఇంత కాలం అండగా ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి తాను పార్టీలో ఉండలేనని చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు.

త‌న బ‌లం చూపించిన దానం

రాజీనామా చేస్తూ  హైదరాబాదులో మీడియాతో దానం మాట్లాడారు. అది ఒక‌ర‌కంగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌లా క‌నిపించింది. *చూడండి... ఈ రోజు నాతో  ఎంత మంది కార్యకర్తలు వచ్చారో. వీరందరికీ అన్యాయం జరిగింది. వాళ్ల‌కు అన్యాయం జ‌రిగినా వారు బాధ‌ప‌డ‌టం లేదు, పైగా పార్టీ కోసం పాటుప‌డే మీకు కూడా అన్యాయం జరిగితే ఎలా? అని త‌న‌తో బాధ‌ప‌డుతున్నార‌ని మీడియాకు వివ‌రించారు. రాహుల్ గాంధీ చెప్పినా పార్టీ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అవ‌కాశం లేకుండా పోతోంది. బ‌ల‌హీన వ‌ర్గాల‌ను వ‌దిలేసిన రోజు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ ను వ‌దిలేస్తార‌ని దానం హెచ్చ‌రించారు. ఇక‌ ఆత్మాభిమానం చంపుకోలేక కాంగ్రెస్ కు రాజీనామా చేసిన‌ట్లు తెలిపారు.
Tags:    

Similar News