టీఆర్ ఎస్‌ లోకి దానం..డీల్ కుదిర్చింది ఆ ఇద్ద‌రే

Update: 2018-06-22 15:30 GMT
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - మాజీ మంత్రి - గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షు డు దానం నాగేందర్ టీఆర్ ఎస్‌ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ లో ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డాన్ని కార‌ణంగా చూపి దానం గులాబీ గూటికి చేర‌నున్నారు. అయితే దానం చేరిక విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం కుదుర్చుకొని, చివరి సమయంలో విరమించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు దానం భారీ కోరిక‌లు కోర‌డం....గులాబీ ద‌ళ‌ప‌తి నో చెప్ప‌డం జ‌రిగింద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. త‌న‌కు కేబినెట్ ర్యాంక్ ఉన్న రాష్ర్ట‌స్థాయి కార్పొరేష‌న్ ప‌ద‌వి - త‌న అనుచ‌రుల‌కు 3 కార్పొరేష‌న్ ప‌ద‌వులు - 25 మందికి కార్పొరేట‌ర్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లివ్వ‌డం వంటివి ఇందులో ఉన్నాయ‌ట‌. దీంతో ఖంగుతిన్న టీఆర్ ఎస్ నేత‌లు ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాక దానం చేరిక‌ను"ప‌రిశీల‌న‌లో" ఉంచడంతో దానం ఆ నిర్ణ‌యం వెన‌క్కుతీసుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

మ‌రోవైపు ఈ ఎపిసోడ్‌ అనంత‌రం కూడా దానం నాగేందర్ టీఆర్ ఎస్‌ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కొద్దికాలం క్రితం ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీతో పాటు మరో ఎమ్మెల్యే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక త‌ర్వాతి వంతు దానం నాగేంద‌ర్‌ దేన‌ని అన్నారు. అయితే అవి కేవలం ఊహాగానాలేనని, ఇందులో వాస్తవం లేదని దానం వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. కానీ తాజాగా కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి దానం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి దానం రాజీనామా లేఖ పంపినట్లు స‌మాచారం.రేపు టీఆర్ ఎస్ లో చేరనున్నార‌ని అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. రేపు దానం నాగేందర్‌ మీడియా ముందుకు రానున్నారు. ఇదిలాఉండ‌గా... దానం త్వరలో టీఆర్ ఎస్‌ లో చేరే అవకాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మరియు కాంగ్రెస్ నాయకులు దానం ఇంటికి వెళ్లారు. అయితే దానం నాగేందర్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ చెప్తోంది. సాయంత్రం ఉత్తమ్ ను దానం నాగేంద‌ర్ క‌ల‌వున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు న‌గ‌రానికి చెందిన ఓ మంత్రి - టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఓ యువ‌నేత‌ - మంత్రిని క‌లిసి దానం నాగేంద‌ర్ టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని స‌మాచారం. ఆ ఇద్ద‌రు మంత్రుల‌తో క‌లిసి జ‌రిపిన చ‌ర్చ‌ల‌ను గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ దృష్టికి చేర‌వేయ‌గా ఆయ‌న కూడా ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News