థర్డ్ వేవ్ లో.. తెలంగాణ పెద్ద పండగ !!

Update: 2022-01-18 07:57 GMT
కరోనా వైరస్ కేసుల తీవ్రత పెరిగిపోతున్న నేపధ్యంలో తెలంగాణాకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వచ్చే నెలలలో మొదలవ్వబోయే మేడారం జాతర రూపంలో తెలంగాణాకు ప్రమాద ఘంటికలు ఇప్పటి నుండే మోగుతున్నాయి. ఫిబ్రవరి 16-19 మధ్యలో మేడారంలో సమక్క-సారక్క జాతర జరగబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా రికార్డులకెక్కిన ఈ జాతరలో సుమారు 80 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

తెలంగాణాతో పాటు ఏపీ, ఝార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుండి పెద్దఎత్తున గిరిజనులు హాజరవుతారు. సో తొందరలో మొదలవ్వబోయే ఈ జాతరకు భక్తులు ముందుగానే పోటెత్తుతున్నారు. జాతరలో తీర్చుకుంటామని భక్తులు మొక్కుకునే మొక్కులను చాలామంది ముందుగానే తీర్చేసుకుంటారు. ఇందులో భాగంగానే గడచిన 15 రోజులుగా పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి బాగా పెరిగిపోతోంది. రోజుకు వేలసంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ పరంగా టెన్షన్ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇన్నివేలమంది హాజరవుతున్న మేడారంలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో చెప్పటం కష్టం. పైగా ఒకేసారి వేలాది మంది వచ్చే భక్తులకు కరోనా స్క్రీనింగ్ చేయటం, వ్యాక్సిన్ సర్టిఫికేట్లు చూడటం కూడా కష్టమే. అధికారులు ఎన్ని నియమ, నిబందనలను చెప్పినా పాటించే భక్తుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.

జాతర కాబట్టి అందులోను మెజారిటి గిరిజనులే కాబట్టి ఎవరినీ ఏమీ అనలేని పరిస్ధితి. మొక్కులు తీర్చుకునేందుకు ఇపుడు వస్తున్న వేలాదిమంది భక్తుల్లోనే ఎవరికి కరోనా వైరస్ ఉందో కూడా తెలీదు. ఇపుడు మేడారం వచ్చి వెళుతున్న వారిని గనుక అధికారులు జాగ్రత్తగా ట్రాక్ చేస్తే ఎవరికైనా కరోనా వైరస్ వచ్చింది లేనిది తెలుస్తుంది. ఒకవైపు కరోనా కేసులు తెలంగాణా అంతటా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మేడారం జాతర వస్తోంది. నిజంగా మేడారం జాతర తెలంగాణాకు డేంజర్ బెల్సనే చెప్పాలి. మరి ప్రభుత్వం ఎలా మ్యానేజ్ చేస్తుందో.
Tags:    

Similar News