మనం సిగ్గుపడాలి: మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఒకటి బాధ్యతలేని సమాజం.. రెండు బాధ్యతలేని రాజకీయ పార్టీలు.
ఇదేమీ ఒక వ్యక్తి గురించో.. ఒక సమాజం గురించో మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్య కాదు. యావత్ సమాజం గురించి.. మనుషుల గురించే ఇలా వ్యాఖ్యానించింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి బాధ్యతలేని సమాజం.. రెండు బాధ్యతలేని రాజకీయ పార్టీలు. ఈ రెండు విషయాలపైనా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్... పి. వేలు మురుగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మనం ఇలాంటివి చూస్తూ ఏ సమాజంలో జీవిస్తున్నామో అర్థం కావడం లేదు'' అని అన్నారు. మనమంతా సిగ్గుపడాలని కూడా.. వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
తమిళనాడులోని ప్రఖ్యాత అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఇది డిసెంబరు 23న జరగ్గా.. తొలుత బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత.. ప్రాంతీయ పార్టీలు కూడా స్పందించాయి. ఇక, దీనిని సుమోటో కేసుగా విచారణకు తీసుకున్న మద్రాస్ హైకోర్టు ప్రభుత్వంపై అప్పట్లోనే నిప్పులు చెరిగింది. విద్యార్థినులకు కూడా రక్షణ కల్పించలేక పోతున్నారని.. శాంతి భద్రతల్లో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. బాధితురాలికి తక్షణ సాయంకింద 25 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.
కాగా.. ఈ ఘటనపై మీడియా కూడా అతిగా స్పందించడం పట్ల కోర్టు అప్పట్లోనే అక్షింతలు వేసింది. యువతి పేరును ప్రస్తావించడం.. యూనివర్సిటీ పేరును రాయడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాజాగా పట్టలి మక్కల్ కట్చి(పీఎంకె) పార్టీ విద్యార్థినిపై జరిగిన దాడిని ఆలంబనగా చేసుకుని నిరసన వ్యక్తం చేయాలని భావించింది. అయితే.. ఇప్పటికే బీజేపీ నేత అన్నామలై చేసిన నిరసనతో తల బొప్పికట్టిన స్టాలిన్ సర్కారు నిరసనలకు అవకాశం లేకుండా.. చేసింది.
దీంతో పీఎంకే పార్టీ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తాము నిరసన వ్యక్తం చేయాలని భావించామ ని.. కానీ, ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ''నిరసన వ్యక్తం చేయడం తప్పుకాదు. కానీ, తర్వాత విద్యార్థిని జీవితం పరిస్థితి ఏంటి? మనం ఎటు పోతున్నాం. మీ లక్ష్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం. అంతకు మించి ఏమీ కనిపించడం లేదు. ఏదో రకంగా ఒక రోజు మీ పార్టీ మీడియా కవరేజీని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఇక, ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరును కూడా ఎండగట్టారు. కులం, మతం ప్రాంతం, మహిళలు, పురుషులు అనే వివక్ష చూపుతున్నారని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఇలాంటి కాలంలో జీవించి ఉన్నందుకు సిగ్గు పడాలని ఘాటుగా స్పందించింది. అక్కడితో కూడా ఆగకుండా.. ''ఇలాంటి ఘటనలు జరిగినందుకు.. మనం అందరం సహనిందితులమే'' అని న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల ద్వారా ఒరిగేది లేదంటూ.. పీఎంకే పిటిషన్‌ను కొట్టి వేశారు.