సైబ‌ర్ మోసానికి బామ్మ బ‌లి.. కోటి రూపాయ‌లు హుష్‌!!

మీకు గిఫ్ట్ వ‌చ్చింద‌ని మోసం చేసేవారు కొందరైతే.. అధిక వ‌డ్డీ ఆశ‌లు చూపి కోట్లు కొల్ల‌గొడుతున్న‌వారు మ‌రికొంద‌రు.

Update: 2025-01-02 21:30 GMT

''మోసం చేయ‌డం అంత తేలిక కాదు గురూ న‌న్ను న‌మ్ము!''- అంటాడు.. మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమా లో ర‌క్త‌క‌న్నీరు నాగ‌భూషణం. కానీ, ఇది ఇప్పుడు పినికిరాని మాట‌. ఎందుకంటే.. మోసం చేయ‌డంలో ఆరితేరిపోయిన వారు క‌ళ్ల ముందు క‌నిపించ‌కుండానే బ్యాంకుల‌ను కొల్ల‌గొట్టేస్తున్నారు. క‌నీసం వారి జాడ ప‌సిగ‌ట్టే యంత్రాంగాలు కూడా లేని స‌మాజంలో అత్యంత అభ‌ద్ర‌త మ‌ధ్య నేటి స‌మాజం నలిగిపోతోంది. మీకు గిఫ్ట్ వ‌చ్చింద‌ని మోసం చేసేవారు కొందరైతే.. అధిక వ‌డ్డీ ఆశ‌లు చూపి కోట్లు కొల్ల‌గొడుతున్న‌వారు మ‌రికొంద‌రు.

అంతేకాదు.. ఆన్‌లైన్ మోసాల‌కు అంతు పొంతు లేకుండా కూడా పోయాయి. ఇలాంటి వాటిలో చిక్కుకుని .. అనేక మంది దేశ‌వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ''క‌ళ్ల ముందు క‌నిపించేవారినే ప‌ట్టుకోవ‌డం క‌ష్టం గా ఉంది. ఇక‌, సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను గుర్తించ‌డం అంటే.. చాలా క‌ష్టం'' అని ఏపీ డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు.. నాలుగు రోజుల కింద చెప్పిన మాటలు అక్ష‌ర స‌త్యం. దీనిలో ఎలాంటితేడా లేదు. తాజాగా ఆ 78 ఏళ్ల బామ్మ ఇలాంటి సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకుని జీవ‌నాధార‌మైన‌.. రూ.కోటిని అర్పించేసింది.

ఏం జ‌రిగింది?

ముంబైకి చెందిన ఓ బామ్మ‌.. అమెరికాలో ఉన్న త‌న కుమార్తెకు నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కొన్ని ప్ర‌త్యేక వంట‌కాలు పార్సిల్ చేసి కొరియ‌ర్ ద్వారా అగ్రారాజ్యానికి పంపించింది. ఆ మ‌రుస‌టి రోజు కొరియ‌ర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నానంటూ.. ఓ వ్య‌క్తి బామ్మ‌కు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ చేసి.. కొరియ‌ర్ క్షేమంగా చేరిందా? అని అడ‌గాల‌ని అనుకుంది. కానీ, ఆమెకు అత‌ను షాకిచ్చాడు. కొరియ‌ర్‌లో ఆహార ప‌దార్థాల‌తోపాటు.. 2 వెల అమెరికా డాల‌ర్లు, పాస్ పోర్టు, ఆధార్, క్రెడిట్ కార్డులు పంపించార‌ని.. ఇది మ‌నీ లాండ‌రింగ్ కింద‌కు వ‌స్తుంద‌ని తీవ్ర‌స్థాయిలో బెదిరించాడు.

తాము అధికారుల‌మ‌ని న‌మ్మ‌బ‌లికేందుకు మ‌రో ఇద్ద‌రితో యూనిఫాం వేయించి.. బామ్మ‌ను ప‌దిరోజుల పాటు వెంటాడారు. ఈ క్ర‌మంలోనే ఆమె న‌గ‌దు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు తెలుసుకుని.. ఆమె తోనే రూ.కోటి న‌గ‌దును వారి ఖాతాల‌కు జ‌మ చేయించుకున్నారు. ఇది జ‌రిగిన రెండు రోజులకు మోస పోయాన‌న్న విష‌యం తెలుసుకున్న బామ్మ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు అప్ప‌టి నుంచి వెతుకుతూనే ఉన్నారు. కానీ, ఎవ‌రూ చిక్క‌లేదు. మొత్తంగా ఏం తేల్చారంటే.. సైబ‌ర్ మోస‌గాళ్ల ప‌ట్ల మ‌న‌మే అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని!!

Tags:    

Similar News