తగ్గని వైరస్ జోరు ..భారత్ మెడికల్ వ్యవస్థ తట్టుకోగలదా!

Update: 2020-06-10 06:15 GMT
ప్రపంచ నిపుణులు ముందునుంచి అంచనా వేసినట్టుగానే ఈ మహమ్మారి జోరు భారత్ లో క్రమక్రమంగా పెరిగిపోతుంది. భారత్‌ లో జూన్,జులై నెలల్లో ఈ వైరస్ కేసులు  పీక్స్‌ కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్లో భారత్ లో కంట్రోల్ లో ఉన్న ఈ వైరస్ , ఇప్పుడు కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానం లో ఉన్న భారత్ ‌లో కేసులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మెడికల్,హెల్త్ కేర్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ, తమిళనాడుల్లో ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడిందన్న కథనాలు వస్తున్నాయి. ఈ సమయంలో కేసుల సంఖ్య పీక్స్ కి చేరితే పరిష్టితి ఏంటి అనేది అందరిలో ఓ ఆందోళన మొదలైంది.

ఇదే సమయంలో తాజాగా తమిళ నటుడు,మాజీ న్యూస్ రీడర్ వరదరాజన్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. చెన్నై ఆసుపత్రుల్లో ఈ వ్యాధి పేషెంట్లకు బెడ్ల కొరత ఉందని అందులో వరదరాజన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇటీవల వైరస్ అనుమానిత లక్షణాలు బయటపడ్డ తన మిత్రుడి ఆవేదనను పంచుకున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అతనికి.. చెన్నై ఆసుపత్రుల్లో ఎక్కడా బెడ్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అతని కుటుంబం చాలా ఆస్పత్రులను సంప్రదించగా.. ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవనే సమాధానమే వినిపించిందన్నారు. కొంతమంది సీనియర్ అధికారులను సంప్రదించినా తన మిత్రుడికి ఏ ఆసుపత్రిలోనూ బెడ్ దొరక లేదని వాపోయారు.

అయితే , దీన్ని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయ భాస్కర్ ఖండించారు. తమిళనాడువ్యాప్తంగా మొత్తం 75వేల పడకలను కరోనా పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఒక్క చెన్నైలోనే 5వేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరదరాజన్ ఆరోపణలపై డైరెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్&పబ్లిక్ హెల్త్ తేన్యాంపేట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 153,505,188 సెక్షన్ల కింద ఆయన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

కేసు నమోదుపై స్పందించిన వరదరాజన్.. తాను చేసిన వీడియో వైరల్ అవుతుందని ఊహించలేదన్నారు. ఆ వీడియో ను కేవలం మా గ్రూప్ తో మాత్రమే పంచుకున్నట్టు తెలిపారు. అలాగే , ఈ  వైరస్‌ పట్ల అప్రమత్తంగా వ్యవహరించమని చెప్పేందుకే వీడియో విడుదల చేసినట్టు చెప్పారు. అంతేకాదు , వైరస్  నియంత్రణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. అయితే, దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈయనలానే ఆరోపణలు చేస్తున్నారు.

ఇక అలాగే ఢిల్లీ లో కూడా రోజురోజుకి కేసులు భారీగా పెరుగుతుండటంతో .. ఆస్పత్రులపై ఒత్తిడి తీవ్రమవుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని వైరస్ ఆస్పత్రులు ఢిల్లీ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే అక్కడ చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఢిల్లీ వాసుల కోసం రిజర్వ్ చేయబడ్డాయని చెప్పారు.

ముంబైలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే ముంబైలో 50వేల కేసులు దాటగా.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉందని చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఇప్పటికే క్రిటికల్ కేర్ యూనిట్లలోని 90శాతం బెడ్స్ నిండిపోయాయి. కరోనా పేషెంట్ల కోసం మొత్తం 9092 బెడ్లను అందుబాటులోకి తీసుకురాగా.. ఇందులో 8570 బెడ్లు నిండిపోయాయి. ఐసీయూ వార్డుల్లోని 1097 బెడ్లలో 94శాతం బెడ్లు నిండిపోయాయి.ముంబైలో మొత్తం 442 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇందులో 378 వెంటిలేటర్లపై ప్రస్తుతం పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.
Tags:    

Similar News