మహమ్మారి పై తొలి వ్యాక్సిన్ భారత్ దే.. 3నెలల్లో సిద్దం?

Update: 2020-07-02 04:15 GMT
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ పై తొలి వ్యాక్సిన్ భారత్ నుంచే రానుందా? ప్రధాని సమీక్షలో ఈ మేరకు క్లారిటీ వచ్చిందా అంటే ఔను అంటున్నారు భారత సంయుక్త డ్రగ్ కంట్రోలర్ (ఇండియా) డాక్టర్ ఎస్.ఈశ్వర్ రెడ్డి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. అంతా అనుకున్నట్టు జరిగితే.. మరో మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని  డాక్టర్ ఎస్.ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని.. మానవులపై పరీక్షలకు అనుమతి లభించినట్టు వెల్లడించారు. సాధారణంగా వ్యాక్సిన్ అభివృద్ధికి ఆరేళ్లు పడుతుందని.. కానీ మనదేశంలో అతివేగంగా పరిశోధనలు, ప్రయోగాలు జరిపి 3 నెలల్లోనే వ్యాక్సిన్ మానవ పరీక్షలకు సిద్ధం చేశారని తెలిపారు.

ప్రపంచంలో చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయని.. అందరికన్నా ముందు భారత్ లోనే వ్యాక్సిన్ లభ్యమవుతుందని ఈశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోవ్యాక్సిన్ పేరుతో పిలిచే ఈ టీకాను భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వేరుచేసిన కరోనా స్ట్రెయిన్ తో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అభివృద్ధి చేశారు. ఈ నెలలోనే ఈ టీకాను మానవులకు టీకా ఇస్తామన్నారు.

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ టీకాపై సమీక్షించారు.ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి  రాగానే ప్రజలకు వేగంగా టీకాలు ఇవ్వడానికి రూపొందించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో  సమీక్షించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి, కరోనా పై పోరులో ముందు నిలిచిన వారికి మొదట టీకాలు ఇవ్వాలని ప్రధాని సూచించారు. ధర కూడా అందరూ భరించదగ్గ స్థాయిలోనే ఉండాలని సూచించారు.
Tags:    

Similar News