కరోనా వైరస్ టీకా ప్రయారిటి జాబితాను అడిగిన కేంద్రం

Update: 2020-10-05 09:30 GMT
కరోనా వైరస్ అందుబాటులోకి వస్తే ఏ ఏ వర్గాల వారికి ముందుగా టీకాలు పంపిణీ చేయాలో  చెప్పాలంటూ కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది. బాగా ఆలోచించుకుని నెలాఖరులోగా ప్రయారిటి జిబితాను కేంద్రానికి అందచేయాలంటూ తాజాగా అన్నీ రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది.  కేంద్రం తాజా అంచనాల ప్రకారం వచ్చే ఏడాది జూలై నెలకు కరోనా వైరస్ కు విరుగుడు టీకా మనకు అందుతుంది.  కరోనా వైరస్ పోరులో ముందు వరసలో పోరాటాలు చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

ఇదే విషయమై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ  టీకా పంపిణీలో అవసరమైన విధి విధానాలను ఆలోచిస్తున్నట్లు చెప్పారు.  కేంద్రమే విధి విధానాలను ఆలోచిస్తోంది కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్రాలు చేసే కసరత్తు ఏముండదు. ఢిల్లీ నుండి బ్లాక్ స్ధాయి వరకు టీకా పంపిణికి అవసరమైన మార్గదర్శకాలపై కేంద్రమే కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పేశారు.  వచ్చే జూలై నాటికి దేశంలోని సుమారు  25 కోట్లమందికి 50 కోట్ల టీకా డోసులు సరఫరా చేసే అవకాశం ఉందని మంత్రి వివరించారు. టీకా తెప్పించటం,  సరఫరా, అవసరమైన వాళ్ళకు అందే మార్గాలు మొత్తాన్ని అధ్యయనం చేయటానికి నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాటిల్ అధ్యక్షతన ఓ కమిటి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి చెప్పారు.
 
ముందుగా నిర్దేశించిన ప్రకారమే టీకా వ్యాక్సిన్లు  నిర్దేశిత ప్రాంతాలకు, నిర్దేశిత వర్గాలకు అందించటమే ప్రాధాన్యతగా కేంద్రం పెట్టుకున్నట్లు చెప్పారు. టీకా వ్యాక్సిన్ను ఎట్టి పరిస్ధితుల్లోను బ్లాక్ మార్కెట్ కు తరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు.  రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి మూడోదశ క్లినికల్ ట్రయల్స్ మనదేశంలో చేసే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.  గడచిన 24 గంటల్లో దేశంలో  75,829 మందికి కరోనా వైరస్ సోకితే ఇందులో 940 మంది చనిపోయినట్లు హర్షవర్ధన్ చెప్పారు.

2021లో కరోనా వైరస్ టీకా మనదేశంలోని జనాలందరికీ అందటం కష్టమే అని మంత్రి అభిప్రాయపడ్డారు.  కారణం ఏమిటంటే టీకాలను అందరికీ అందించాలంటే సుమారు రూ. 50 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇందులో మేజర్ షేర్ కేంద్రమే భరించాలట. దీనికితోడు వ్యాక్సిన్ తయారైతే  భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చి కొనుగోలు చేయటానికి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు రెడీగా ఉన్నాయి.  ఫార్మా కంపెనీలు కొనుగోలు చేసే వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులో ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.  మొత్తానికి  వచ్చే ఏడాదిలో అయినా మనదేశంలోకి కరోనా వైరస్ కు విరుగుడు టీకా వస్తుందంటే సంతోషించాల్సిందే కదా.
Tags:    

Similar News