మహమ్మారి సెకండ్ వేవ్ డేంజర్.. మనకెంత దూరం?

Update: 2020-10-31 05:15 GMT
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా.. చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టటం.. ఆ ఆనందంలో సెకండ్ వేవ్ డేంజర్ ను అంచనా వేయటంలో జరుగుతున్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అమెరికా.. యూరప్ దేశాల్లో షురూ అయిన సెకండ్ వేవ్.. ఆ దేశాల్ని షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. మొన్నటివరకు పాజిటివ్ లిస్టులో దూసుకెళుతున్న భారత్ లో పాజిటివ్ కేసుల నమోదు కాస్త తగ్గుముఖం పట్టింది. ఆ మధ్యలో రోజుకు లక్ష కేసుల చేరువకు వెళ్లటం.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి.. ప్రస్తుతం రోజుకు 44వేల కేసులు నమోదువుతున్నాయి.

అంటే.. మనం మొదటి వేవ్ చివరిదశలో ఉన్నాం. మరి.. సెకండ్ వేవ్ సంగతేమిటి? అన్నది ప్రశ్న. చైనాలో మొదలైన కోవిడ్ -19 తొలుత యూరప్ దేశాల్ని.. ఆ తర్వాత అమెరికాను ప్రభావితం చేయటం.. ఆ తర్వాత భారత్ లో తన విశ్వరూపం చూపించటం తెలిసిందే. తాజాగా యూరప్.. అమెరికా దేశాల్లో సెకండ్ వేవ్ సుడిగాలి మాదిరి చుట్టేస్తోంది. దాని దెబ్బకు ఆయా దేశాలు కిందామీదా పడుతున్నాయి. కొన్ని దేశాలైతే.. మరో ఆలోచన లేకుండా లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం సెకండ్ వేవ్ లో విలవిలలాడుతున్న అమెరికా.. యూరప్ దేశాల్లో కేసులు అంతకంతకూ భారీగా నమోదవుతున్నాయి. వైరస్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులుగా రోజూ 5 లక్షల కేసులు నమోదైతే.. నిన్న ఒక్కరోజే 5.7లక్షల కేసులు నమోదు కావటం గమనార్హం. దీంతో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 4.58 కోట్లుగా చెప్పాలి. నిన్న ఒక్క రోజులో ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర వేల మంది మరణించారు. తాజాగా యాక్టివ్ కేసులు 1.14 కోట్ల కేసులు ఉంటే.. వారిలో లక్ష మంది వరకు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రతి వంద మంది పాజిటివ్ కేసుల్లో కచ్ఛితం గా ఇద్దరు.. ముగ్గురు మరణిస్తుండటం గమనార్హం. అమెరికా.. యూరప్ ను షేక్ చేస్తున్న సెకండ్ వేవ్ కు భారత్ ఎంత దూరంలో ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఫస్ట్ వేవ్ చివరి దశలో ఉన్న భారత్ లో రోజు 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి.

నిపుణుల అంచనా ప్రకారం.. యూరప్ లో మొదలైన సెకండ్ వేవ్ భారత్ కు నవంబరు చివరి వారానికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. డిసెంబరు.. జనవరి రెండు నెలల్లో కేసుల నమోదు తీవ్రత చాలా ఎక్కువ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటి వేవ్ లో రోజుకు 90వేలకు పైగా కేసులు నమోదు కాగా.. సెకండ్ వేవ్ వేళ.. కేసుల నమోదు భారీగా ఉంటుందని భావిస్తున్నారు.

కరోనా కారణంగా ఉపాధి అవకాశాల్నికోల్పోవటం.. వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమైనవేళ.. బడుగు.. మధ్యతరగతి జీవులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇంకా అందులో నుంచి తేరుకోలేదు. సెకండ్ వేవ్ విరుచుకుపడితే.. మనలాంటి దేశాల్లో పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. అందుకే.. రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News