బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా .. మొదటి స్థానానికి అడుగు దూరం మాత్రమే !

Update: 2021-04-12 08:59 GMT
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో నిన్నటి వరకు భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండేది. కానీ, సెకండ్ వేవ్ కారణంగా గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో భాగంగా భారత్ మూడో స్థానం నుండి రెండో స్థానం కి ఎగబాకింది. 13.53 (1.35కోట్లు) మిలియన్ల కరోనా కేసులతో బ్రెజిల్‌ ని దాటేసింది. బ్రెజిల్ ‌లో ఇప్పటివరకూ 13.45 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న దేశం గా మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో 31.2మిలియన్ల కరోనా కేసులతో నిలిచింది. ఇకపోతే , గత 24 గంటల్లో భారత్‌ లో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 904 మంది కరోనాతో మృతి చెందారు. తాజా లెక్కలతో కలిపి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,70,179కి చేరింది

 ప్రధానంగా బ్రిటన్ ‌కి చెందిన రూపాంతర  స్ట్రెయిన్ ఇండియాలో జోరుగా ఉంది. మిగతా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ల కంటే ఇది ఎక్కువగా పాకుతోంది. ఒకరికి వస్తే చుట్టుపక్కల అందరికీ పాకేస్తోంది. ఇండియాలో కొత్తగా 29,33,418 వ్యాక్సిన్లు వెయ్యగా... మొత్తం వేసిన టీకాల సంఖ్య 10,45,28,565కి చేరింది. ప్రస్తుతం భారత్‌ లో ఉన్న యాక్టివ్ కేసుల్లో 70.82శాతం కేసులు మహారాష్ట్ర,ఛత్తీస్ ‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నవే. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 48.57 శాతం యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది కాబట్టి, లాక్ ‌డౌన్ ద్వారా కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది.

ఈ నెల 11 నుంచి 14వరకూ దేశవ్యాప్తంగా 'టీకా ఉత్సవ్' నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు దీని ద్వారా 27లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రమంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర,ఛత్తీస్‌ గఢ్, పంజాబ్ ‌లోని 50 జిల్లాల్లో కరోనా నిబంధనలు సరిగా అమలుకావట్లేదని సెంట్రల్ టీమ్ కేంద్రానికి రిపోర్ట్ చేసింది. దీనితో దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కోవిడ్‌ ఉధృతి బాగా కనిపిస్తోంది.  మహారాష్ట్రలో కేసులు  37 శాతం పెరిగి 63,294 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత 24 గంటల్లో 349 మంది మరణించారు.
Tags:    

Similar News