తెలంగాణలో వైరస్ విజృంభణ ...టాప్-10లోకి ఎంట్రీ!

Update: 2020-06-25 05:30 GMT
తెలంగాణ ఇప్పుడు మహమ్మారికి అడ్డాగా మారిపోయింది. రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు సింగల్ డిజిట్ కి పరిమితమైన ఈ పాజిటివ్ కేసులు ..ఇప్పుడు 4 డిజిట్స్ దగ్గర్లోకి చేరాయి. జూన్ 21న 730 పాజిటివ్ కేసులు 22వ తేదీన 872, 23వ తేదీన 879 కేసులు, జూన్ 24న 891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో  వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

తెలంగాణలో బుధవారం నాటికి మొత్తం వైరస్ కేసుల సంఖ్య 10,444కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5858గా ఉన్నాయి. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్-10లో చేరింది. మహారాష్ట్ర 1.50 లక్షల కేసుల దిశగా వెళ్తుండగా... ఢిల్లీలో కోవిడ్ బాధితుల సంఖ్య 70 వేలు దాటింది. తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేలు దాటింది. తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్‌ , ఉత్తర ప్రదేశ్‌ ఉన్నాయి. దేశంలోని వైరస్ కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటానే దాదాపు 70 శాతం ఉంది.

దేశంలోని 12 రాష్ట్రాల్లో  వైరస్ కేసుల సంఖ్య 10 వేలు దాటగా.. తెలంగాణ టాప్ 10లోకి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత అత్యధిక వైరస్ పాజిటివ్ కేసులు తెలంగాణలోనే నమోదవుతున్నాయి. దక్షిణాదిలో తమిళనాడు తర్వాత ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.  10,331  పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు అయ్యాయి. జూన్ 14 నాటికి రాష్ట్రంలో 5 వేల లోపు కేసులు ఉన్నాయి. కేవలం పది రోజుల్లో మరో 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. జూన్ 18 నాటికి తెలంగాణలో కరోనా కేసులు 6 వేలు దాటాయి. వారం రోజుల్లోనే 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే రీతిలో కొనసాగితే తెలంగాణ మరికొద్ది రోజుల్లోనే టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Tags:    

Similar News