మనం తల్చుకుంటే అమెరికా అయ్య కావొచ్చా కేసీఆర్!

Update: 2020-06-26 08:30 GMT
కీలకమైన వ్యాఖ్య చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓపక్క మాయదారి రోగానికి సంబంధించి పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి ఏటా జూన్ లో నిర్వహించే ఈ ప్రోగ్రాం.. ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం షురూ అయ్యింది. ఇందులో భాగంగా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తన సహజశైలిలో చెలరేగిపోయారు. తాను నమ్మిన సిద్దాంతాన్ని.. తన పాలనను తెగ మెచ్చుకున్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నూటికి నూరుశాతం ధనిక రాష్ట్రమేనని స్పష్టం చేసిన ఆయన.. ‘‘నేను అధికారికంగా చెబుతున్నా. తెలంగాణ గరీబోళ్ల రాష్ట్రం కాదు. వందకు వంద శాతం ధనిక రాష్ట్రమే’’ అని తేల్చారు.

మహమ్మారి గడబిడతో మూడు నెలలు సగం జీతాలు ఇచ్చామని.. నెలలోనే పుంజుకున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇచ్చి..ఆ మొత్తాన్ని రైతులకు పంచినట్లు చెప్పారు. గతంలో రైతు అంటే పిల్లను ఇచ్చేటోళ్లు కాదని.. ఇప్పుడు తెలంగాణలో రైతుల దగ్గర తప్ప ఎవరి దగ్గరా పైసల్లేవన్నారు.

మొగులు ముఖం చూసి వ్యవసాయం చేసే రోజులు పోతాయని.. రోహినీ కార్తెలోనూ రైతులు నాట్లు వేసే రోజులు తొందరలోనే వస్తాయన్నారు. పిల్లను ఇవ్వటానికి  రైతు కంటే పాన్ డబ్బా వాళ్లు నయమని అనుకునేవాళ్లని.. ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. రైతుల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పటం లేదు కానీ.. అప్పులు లేకుండా ఎవరి పెట్టుబడి వాళ్లే పెట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంటు.. రైతుబంధు తదితర పథకాలతో పరిస్థితి మరింత మారుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మన్యూనతకు గురి చేశారని.. తెలంగాణ వారికి వ్యవసాయమే రాదన్నారని.. ఐదేళ్ల ఫలితాలు చూస్తే ఏమైందో ఇట్టే అర్థమవుతుందన్నారు. రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఫలితం ఎలా ఉంటుందో రుజువైందన్నారు. ఎంతసేపు జపాన్.. జర్మనీ స్టోరీలు వినుడే కాదు.. మనం తల్చుకుంటే అమెరికా అయ్య కావొచ్చన్నారు. నిజమే.. ఆర్థికంగా అమెరికా అయ్య అయినా కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగితే పాజిటివ్ విషయంలో అమెరికా అయ్య కావుడు పెద్ద కష్టమైన పనైతే కాదన్న మాట వినిపిస్తోంది. రైతులు.. వ్యవసాయం అవసరమే.. కానీ.. అంతకంటే ముందు ప్రజారోగ్యం చాలా అవసరమన్న విషయాన్ని సారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
Tags:    

Similar News