కేసులతో వణికిన తెలంగాణలో ఇప్పుడు సీన్ అలా మారింది

Update: 2020-07-11 04:00 GMT
దేశంలోని వివిధ రాష్ట్రాలు.. అందులోని ప్రధాన నగరాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్ని పరిశీలిస్తే.. ఆకాశమే హద్దు అన్నట్లుగా రోజురోజుకి పెరిగిపోవటమే తప్పించి.. తగ్గటం కనిపించదు. మొన్నటివరకూ రికార్డు స్థాయి అన్నట్లు ఏ రోజుకు ఆ రోజు పాత రికార్డుల్ని తిరగరాసేలా భారీగా కేసులు నమోదు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గడిచిన రెండు..మూడు రోజులుగా సీన్ మొత్తం మారిపోయింది.

వెయ్యి నుంచి రోజుకు పద్దెనిమిది వందల వరకూ కేసులు నిత్యం నమోదవుతున్న తీరుకు భిన్నంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గిపోయింది. గడిచిన మూడు రోజుల్లో కొత్త కేసుల నమోదు వరుసపెట్టి తగ్గిపోతున్నాయి. శుక్రవారం రాత్రి విడుదల చేసిన గణాంకాల్ని చూస్తే ఈ విషయం మరోసారి స్పష్టమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 1278 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం10,354 మందికి పరీక్షలు నిర్వహిస్తే 9076 మందికి నెగిటివ్ రిపోర్టు రాగా.. 1278 పాజిటివ్ గా తేలింది.

అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజులోనే 1013 మంది డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పడిపోయింది.  ఇటీవల కాలంలో రోజుకు పదిహేను వందల మందికి తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదైన దానికి భిన్నంగా కొద్ది రోజులుగా మూడంకెల్ని దాటకుండా కేసులు నమోదవుతున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. రంగారెడ్డి జిల్లాలో కేసుల తీవ్రత అంతకంతకూ ఎక్కువఅవుతోంది.

శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ చూస్తే.. హైదరాబాద్ లో 762 కొత్త కేసులు నమోదైతే.. రంగారెడ్డిలో 171 కేసులు. మేడ్చల్ లో 85.. సంగారెడ్డిలో 36 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఎనిమిది మంది మరణించారని.. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో 339 మంది మరణించినట్లైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 12680 కాగా.. అందులో 85 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News