ఫాంహౌస్ కు వెళ్లిన కేసీఆర్ సిటీకి వచ్చేస్తున్నారు.. గవర్నర్ తో భేటీ అందుకేనా?

Update: 2020-07-20 09:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఫాంహౌస్ కు వెళ్లటం.. తనకు తోచినప్పుడు ప్రగతిభవన్ కు రావటం తెలిసిందే. మొన్నామధ్య రెండువారాలకు పైనే ఎవరికి అందుబాటులోకి రాకుండా ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఆయన ప్రత్యర్థులు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ తెగ హడావుడి చేయటాన్ని మర్చిపోలేం. రెండు వారాలకు పైనే ఫాంహౌస్ లో ఉన్న ఆయన సిటీకి రావటం.. రెండు మూడు రోజులకే తిరిగి వెళ్లిపోవటంపై పలువురు వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారు.

ఈ తరహా విమర్శల్ని అస్సలు పట్టించుకోని కేసీఆర్ తనకు తోచినట్లుగా వ్యవహరించటం మామూలే. మొన్ననే ఫాంహౌస్ కు వెళ్లిన ఆయన రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి సిటీకి వచ్చేయటం ఆసక్తికరంగా మారింది. గతానికి భిన్నంగా ఈసారి ఆయన గవర్నర్ తమిళ సైను కలవనున్నారు. ఫాంహౌస్ నుంచి సిటీకి వచ్చిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి.. గవర్నర్ తమిళ సైతో భేటీ కానున్నారు.

గతంలో గవర్నర్ గా పని చేసిన నరసింహన్ తో సీఎం కేసీఆర్ తరచూ భేటీ అయ్యేవారు. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల గురించి ఆయన చర్చలు జరిపినట్లుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత గవర్నర్ గా నియమితులైన తమిళ సైకు గతంలో మాదిరి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. తన విజన్ గురించి తరచూ వివరించేవారన్న మాట వినిపిస్తుండేది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ తమిళ సైను సీఎం కలుస్తున్నారన్న అభిప్రాయం పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

ఇక.. తాజాగా గవర్నర్ ను ఎందుకు భేటీ అవుతున్నారన్న విషయానికి వస్తే.. సచివాలయ కూల్చివేత అంశంతో పాటు.. తాను అప్రూవ్ చేయనున్న డిజైన్ ను చూపించి వివరిస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ కారణంతోనే తాజా భేటీ ఉందని చెబుతున్నారు. వచ్చే నెలలో కొత్త సచివాలయానికి శంకుస్థాపన జరుగుతున్న వేళ.. అసలేం జరుగుతుందన్న వివరాల్ని గవర్నర్ కు తెలియజేయటంతో పాటు.. రాష్ట్రంలో కరోనా కేసులను డీల్ చేసే విషయాన్ని వివరిస్తారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో గవర్నర్ తమిళ సై యాక్టివ్ గా మారి.. ప్రజా సమస్యల్ని తరచూ ప్రస్తావిస్తున్న వేళ. . ప్రభుత్వం తరఫున జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించి రాజ్ భవన్ ను వెళుతున్నట్లుగా చెప్పొచ్చు. 
Tags:    

Similar News