జగన్ కు జోష్.. కర్నాటకలో రాజధాని వికేంద్రీకరణ

Update: 2020-02-21 11:00 GMT
రాజధాని తరలింపుపై వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో ఇప్పటికి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జగన్ తీసుకున్న అధికార వికేంద్రీకరణ నిర్ణయం మంచిదైనా దీర్ఘకాల లక్ష్యంతో తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికిప్పుడు ఫలితం ఉండకపోవచ్చు. అందుకే అవగాహన లేక దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ అధికార వికేంద్రీకరణ నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిణామాలకు దారి తీసింది. అయినా జగన్ పట్టు వదలకుండా మూడు రాజధానులు చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో జగన్ కు జోష్ ఇచ్చే పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

పక్క రాష్ట్రం కర్నాటక లో కూడా జగన్ మాదిరి రాజధానిని వికేంద్రీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో జగన్ కు కొంత ఉత్సాహం వచ్చినట్టే. ఎందుకంటే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అంటే బీజేపీ అధిష్టానం ఒకే చెప్పినట్లు తెలిసింది. దీంతో కర్నాటకలో చేశారు.. కాబట్టి తాము కూడా చేస్తున్నట్లు జగన్ వాదించేందుకు ఒక అవకాశం దొరికింది. కర్నాటక లో ఒకే చెప్పిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకించే అవకాశం లేదు. దీంతో జగన్ కు కొంత బూస్ట్ వచ్చినట్టే.

అయితే కర్నాటక తీసుకున్ననిర్ణయం ఆంధ్రప్రదేశ్ నుంచే స్ఫూర్తి పొందినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కొన్ని కార్యాలయాల తరలింపు చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ విషయం కర్నాటకలో చర్చకు వచ్చింది. దీంతోనే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజధాని బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయానికి ముందే కొన్ని రోజుల కిందట కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఉత్తర కర్ణాటక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యాలయాలను వారికి దగ్గరగా ఉండేలా చూస్తామని, అక్కడికి తీసుకెళ్లేలా నిర్ణయించినట్లు చెప్పారు కూడా. ఇప్పుడు రాజధాని తరలింపు పై ఏపీ బీజేపీ నాయకులు నోరెత్తే అవకాశం లేదు. ఈ నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాజధాని తరలింపు ప్రక్రియ ముమ్మరం చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News