ప్లీజ్ చంద్రబాబు.. ఈ జేసీబీ పర్యటనలు ఇంకెంత కాలం?

తాజాగా ఆయన కాకినాడ జిల్లా రాజుపాలెంలోని వరద ప్రాంతాన్నిసందర్శించారు.ఆయన ఆ ప్రాంతానికి వెళ్లే వేళకు.. మోకాలి కంటే ఎత్తున వరద నీరు ఉండటం కనిపించింది.

Update: 2024-09-12 04:14 GMT

అనుకోని రీతిలో విపత్తు విరుచుకు పడినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. నిజానికి విపత్తు వేళ.. పాలకులు అధికార యంత్రాంగం పని చేసేలా.. బాధితులకు సాయం అందేలా చూస్తే బాగుంటుంది. అంతే తప్పించి.. నేరుగా బాధితుల వద్దకు వెళ్లటం వల్ల లాభం కంటే నష్టమే జరుగుతుంది. వారికి అందాల్సిన సహాయక చర్యలు మధ్యలో ఆగే వీలుంది. ముఖ్యమంత్రి లాంటి స్థానాల్లో ఉన్న వారు ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు.. పోలీసులు.. అధికారుల ఫోకస్ మొత్తం సీఎం మీదనే ఉంటుంది తప్పించి.. బాధితులకు అందించాల్సిన సాయం మీద ఉండదు.

ఇంత చిన్న విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్న. తాజాగా ఆయన కాకినాడ జిల్లా రాజుపాలెంలోని వరద ప్రాంతాన్నిసందర్శించారు.ఆయన ఆ ప్రాంతానికి వెళ్లే వేళకు.. మోకాలి కంటే ఎత్తున వరద నీరు ఉండటం కనిపించింది. మామూలుకార్లు వెళ్లే అవకాశం లేకపోవటంతో.. విజయవాడలో మాదిరి జేసీబీ మీద ప్రయాణించిన చంద్రబాబు.. బాధితులను పరామర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నారు.

ఇదంతా చూసినప్పుడు.. ముందు ముంపు ప్రాంతాల్లోని నీళ్లు క్లియర్ అయ్యే అంశం మీద చంద్రబాబు ఫోకస్ పెట్టి ఉండాల్సిందే తప్పించి.. ఇలా జేసీబీలతో తాను ప్రయాణం చేయటం ద్వారా.. వారికి అందాల్సిన సహాయక చర్యలకు గండి పడుతున్న్ విషయాన్ని గుర్తించకపోవటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. వరద పోటు వచ్చి ఇప్పటికే నాలుగైదు రోజులు అయినప్పుడు.. ఇప్పటికి పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం చూసినప్పుడు అక్కడి ప్రజలు ఎంతటి ఇబ్బందికి గురి అవుతున్నారన్న విషయం అర్థమవుతుంది.

ఇలాంటి వేళలో..ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లటం వల్ల బాధితులకు ప్రత్యేకంగా ఏమైనా ఒరుగుతుందా? వారి వరద కష్టాలు తీరుతాయా? వారికి అందాల్సిన సహాయక చర్యలు మరింత ఆలస్యం అవుతాయి. చంద్రబాబు టూర్ పుణ్యమా అని అధికారులు హడావుడి చేయటం.. తాము ఎంతో శ్రమిస్తున్నట్లుగా బిల్డప్ లు ఇవ్వటమే తప్పించి మరింకేమీ జరగదు. దీనికి బదులుగా వార్ రూం ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి సమీక్షించటం.. వరద తీవ్రతతగ్గి.. సాధారణ జీవనానికి ప్రజలు చేరువ అయ్యేలా చేయటం.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని మానిటర్ చేయటం.. వారికి అవసరమైన సహాయక చర్యల మీద ఫోకస్ పెడితే ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా జేసీబీల్లో జర్నీ చేయటం ద్వారా వరద కష్టంలో ఉన్న వారి వేదన తీరదన్నవిషయాన్ని చంద్రబాబు అండ్ కో గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News