వైసీపీ నేతలు దూరమేనా ?

Update: 2021-09-01 05:30 GMT
రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్న సెప్టెంబర్ 2వ తేదీ ఆహ్వానానికి వైసీపీ నేతలంతా దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు ప్రచారం మొదలైంది. 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 12వ వర్ధంతి అన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈసారి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ సతీమణి విజయమ్మ హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తున్నారు. అంటే అచ్చంగా వర్ధంతి కార్యక్రమం కాదు కానీ ఈ సందర్భంగా వివిధ పార్టీల్లోని ముఖ్యనేతలను ఆహ్వానించారు.

వైఎస్ క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు సన్నిహితులు, మద్దతుదారులను విజయమ్మ పిలిచారు. ఆహ్వానాలను అందుకున్నవారిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీల్లోని నేతలున్నారు. దీంతో సహజంగానే కార్యక్రమంపై జనాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది నేతలకు. విజయమ్మ ఆహ్వానం ప్రకారం కార్యక్రమానికి వెళ్ళాలా ? వద్దా ? అనేదే సమస్య. వెళితే ఏమి సమస్య వస్తుందో ? గైర్హాజరైతే జనాలు ఏమనుకుంటారో అనే సమస్య చాలా మంది నేతలను పీడిస్తోందట.

నేతల్లో అసలింత సమస్య ఎందుకంటే వాళ్ళంతా వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులు, మద్దతుదారులు కాబట్టే. సరే మిగిలిన వాళ్ళ విషయాలు పక్కనపెట్టేసినా కొడుకు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఆత్మీయ సమావేశానికి దూరంగానే ఉండాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులకు దూరంగా ఉండేందుకే తాను తన తల్లి విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

జగనే ఆత్మీయ సమావేశానికి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలిసిన తర్వాత ఇక మిగిలిన నేతలు వెళ్ళే ధైర్యం చేస్తారా ? మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏల్లో కూడా వైఎస్ కు సన్నిహితంగా మెలిగిన వారున్నారు. ఆత్మీయ సమావేశానికి వెళ్ళాలని వాళ్ళకు ఉన్నా జగన్ నిర్ణయం కారణంగా తాము కూడా దూరంగా ఉండటమే మేలని అనుకున్నారట. కాబట్టి ఇతర పార్టీల్లో నుండి హాజరయ్యే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా వైసీపీ నేతల్లో మాత్రం ఎవరు హాజరయ్యే అవకాశాలు దాదాపు లేవనే సమాచారం.

ఆత్మీయ సమావేశానికి దూరంగా ఉండబోతున్నట్లు జగన్ ఇప్పటికే విజయమ్మకు చెప్పారని పార్టీ నేతలంటున్నారు. జగన్ నిర్ణయం నేపథ్యంలో కూతురు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏమి చేస్తారో చూడాలి. ఎందుకంటే తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి కొత్తగా రాజకీయపార్టీ పెట్టిన విషయం తెలిసిందే. గురువారం జరుగుతున్న ఆత్మీయ సమావేశం విషయం రాజకీయాల్లో ఇఫుడు హాట్ టాపిక్ అయిపోయింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News