కేజ్రీ సూపర్, ఢిల్లీ పీఠం ఈసారీ బీజేపీ కి అందని ద్రాక్షేనా?

Update: 2020-01-28 04:04 GMT
క్రితం సారి 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 గెలుచుకున్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి, మూడు సీట్లు గెలిచి ఘోర పరాభవం పాలైన బీజేపీ కి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకం. ఎవరికి వారు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు గెలిపిస్తాయని ఏఏపీ చెబుతుండగా, కేజ్రీవాల్ వైఫల్యాలు తమకు చుక్కాని అని కమలదళం అంటోంది.

2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ 56 శాతం ఓట్ల తో మొత్తం 7 లోకసభ స్థానాలను దక్కించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు చెబుతుండగా, లోకసభ, అసెంబ్లీ ఎన్నికలని ఓటర్లు వేర్వేరుగా చూస్తున్నారని, కాబట్టి కేజ్రీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. అయితే జనవరి లో సీ ఓటరు విడుదల చేసిన ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఏఏపీ కి 53 శాతం, బీజేపీకి 29 శాతం, కాంగ్రెస్‌కు 4 శాతం తక్కువ సీట్లు వస్తాయని తేల్చింది. సీట్ల సంఖ్యను వెల్లడించలేదు.

తాజాహగా న్యూస్ ఎక్స్ పోల్ స్ట్రాట్ ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఏఏపీకి 48.56 శాతం, బీజేపీకి 31.7 శాతం, కాంగ్రెస్‌కు 9.64 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఏఏపీ కి 53 నుంచి 56 సీట్లు, బీజేపీ కి 12 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్‌ కు రెండు నుంచి నాలుగు సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. 2015 ఎన్నికల్లో ఏఏపీ కి 53.93 శాతం, బీజేపీకి 31.78 శాతం, కాంగ్రెస్‌‌ కు 10.34 శాతం ఓట్లు వచ్చాయి.

విద్య, ఆరోగ్యం అంశాల్లో ఏఏపీ ప్రభుత్వం పని తీరు పట్ల ప్రజలు సంతృప్తి గా ఉన్నారని ఈ సర్వే లో తేలింది. అయితే మహిళా భద్రత, ఉద్యోగాలు, కాలుష్యం, అవినీతి ఆందోళన కలిగిస్తున్న అంశాలు. అయిదేళ్లు పాలించిన కేజ్రీకి మరోసారి అవకాశం ఇచ్చి చూద్దామని దేశ రాజధాని ఓటర్లు భావిస్తున్నారట. కానీ సీట్లు మాత్రం 67 నుంచి 53 వరకు పడిపోనున్నాయి. 59.57 శాతం మంది కేజ్రీవాల్, ఆయన టీమ్ పని బాగుందని ఈ సర్వే లో అభిప్రాయ పడ్డారు. 24.61 శాతం మంది పర్వాలేదు అన్నారు. 15.51 శాతం మంది అసంతృప్తి తో ఉన్నారు. 0.32 శాతం మంది ఏమీ చెప్పలేకపోయారు.


Tags:    

Similar News