ఢిల్లీ యువతి యాక్సిడెంట్‌.. వెలుగులోకి సంచలన విషయాలు!

Update: 2023-01-08 07:30 GMT
కొత్త సంవత్సరం నాడు దేశ రాజధానిలో కలకలం రేపిన అంజలి సింగ్‌ (20) దుర్మరణం కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సంవత్సరం రోజు ఆదివారం రాత్రి స్కూటీపై వెళ్తున్న అంజలి సింగ్‌ అనే యువతిని మద్యం తాగి కారు నడుపుతున్న యువకులు ఢీకొట్టడంతో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అంజలి కాలు కారు వెనుక ఇరుక్కుపోయింది. అయినా సరే యువకులు ఆపకుండా దాదాపు 13 కిలోమీటర్లు ఈడ్చుకుపోవడంతో తీవ్ర గాయాలపాలై అంజలి మృతి చెందింది.

ఈ కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న అంజలి స్నేహితురాలు నిధి గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. డ్రగ్స్‌ కేసులో నిధి ప్రస్తుతం బెయిలుపై ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో స్కూటీపై అంజలితోపాటు ప్రయాణిస్తున్న నిధి ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు స్కూటీ దిగేసింది. కాగా 2020 డిసెంబరులో తెలంగాణ నుంచి ఢిల్లీకి 30 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఆగ్రా రైల్వేస్టేషనులో నిధి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఘటన జరిగిన రోజు రాత్రి మృతురాలు అంజలి మద్యం తాగినట్లు నిధి మీడియాకు తెలిపింది. అయితే శవపరీక్ష నివేదికలో మాత్రం ఆమె మద్యం తాగిన ఆనవాళ్లు లేవని అంజలి కుటుంబం తరఫు న్యాయవాది చెప్పడం గమనార్హం.

తాజా ప్రమాదం కేసులో నిధిని అరెస్టు చేయలేదని, విచారణ చేసేందుకు మాత్రమే పిలిచారని పోలీసులు స్పష్టం చేశారు. అంజలి తమ కారు కింద ఇరుక్కుపోయిందని నిందితులకు తెలుసని నిధి మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేయగా, ఒకరు లొంగిపోయారు. దీపక్‌ ఖన్నా, అమిత్‌ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్‌ మిట్టల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నిందితులను రక్షించాలని చూసిన పోలీసులు అశుతోష్, అంకుష్‌ ఖన్నాలను కూడా అరెస్టు చేశారు.

మరోవైపు అంజలి సింగ్‌ కుటుంబానికి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ఖాన్‌ అండగా నిలిచారు. షారుక్‌ నిర్వహిస్తున్న మీర్‌ ఫౌండేషన్‌ తరఫున అంజలి తల్లి, తోబుట్టువులకు ఆర్థికసాయం అందించారు.
Tags:    

Similar News