సరి బేసితో పాటు.. ఒకరోజు అలా కూడానా?

Update: 2015-12-24 04:40 GMT
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. జనవరి 1 తేదీ నుంచి వాహనాల చివరి అంకెల్లోని సరి బేసి ఆధారంగా రోజుకు ఒకటి చొప్పున వాహనాల్ని రోడ్ల మీదకు అనుమతించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేయటానికి వీలుగా ఢిల్లీ సర్కారు సమాయుత్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. సరి బేసితో పాటు.. మరో నిర్ణయాన్ని తీసుకోవాలని ఢిల్లీ సర్కారు భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం ఏమిటంటే.. వారంలో ఒక రోజు ఇంటి నుంచి ఆఫీసు పని చేయటం (వర్క్ ఫ్రం హోం)గా చెబుతున్నారు. విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులు వారంలో ఒకరోజు.. బుధవారం ఇంటి నుంచే చదువుకోవటం.. పని చేయటం లాంటివి చేస్తే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆలోచనను జాతీయ శాస్త్ర.. సాంకేతిక అభివృద్ధి సంస్థ తెరపైకి తీసుకొచ్చింది. వారంలో ఒకరోజు ఇంటి నుంచే పని చేయటం కారణంగా కాలుష్యం పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

వాహనాల్లో సరి.. బేసి విధానం విజయవంతం కాదన్న వాదన పెరుగుతోంది. ఇదే విధానాన్ని అమలు చేసిన మెక్సికో.. బొగొటాలు విఫలం చెందాయని చెబుతున్నారు. సరి బేసి ఆంక్షలతో ఈ దేశాల్లో రెండో కారును కొనే వారి సంఖ్య పెరిగిందని.. ఈ కారణంగా కాలుష్యం మరింత పెరిగిందని గుర్తుచేస్తున్నారు. నిజానికి ఇలాంటి అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమైనా.. ఢిల్లీ సర్కారు మాత్రం సానుకూల ధోరణితో.. సరిబేసి విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో పాటు.. వారానికి ఒక రోజు ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై కేజ్రీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో..?
Tags:    

Similar News