యువతిని 35 ముక్కలుగా నరికిన కేసులో కీలక శరీర భాగాలు లభ్యం!

Update: 2022-11-21 04:31 GMT
ఢిల్లీ మెహ్రౌలీలో సహజీవనం చేస్తున్న యువతిని 35 ముక్కలుగా నరికి చంపిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఏడాది మేలో హత్య జరగగా ఇటీవల ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. యువతితో సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడు అఫ్తాబే తన ప్రేయసిని చంపి ఆ తర్వాత 35 ముక్కలుగా నరికి ప్రిజ్‌లో దాచి ఉంచిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా దాదాపు 20 రోజుల పాటు రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున పడేశాడు.

కాగా శ్రద్ధా వాకర్‌ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమైన ఢిల్లీ పోలీసులు ఆమె తలను ఎక్కడ పడేశాడో వెతుకులాట సాగిస్తున్నారు. అఫ్తాద్‌ ఆమె తలను ఢిల్లీలోని ఓ చెరువులో పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఆమె తల కోసం మెహ్రౌలీలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ చెరువులో పూర్తి స్థాయిలో నీరు ఉండటంతో ఆ నీటిని తొలగించే పనులను ముమ్మరంగా చేస్తున్నారు.

మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ చెరువు చాలా పెద్దదని 15–20 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

మరో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆధారాల కోసం పోలీసు బృందాలు వెతుకులాట సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిపిన విచారణలో శ్రద్ధ శరీరంలోని 13 ముక్కలు పోలీసులకు లభించాయి. అయితే శ్రద్ధా తల ఆచూకీ లభించలేదు. అలాగే ఆమెను నరకడానికి వాడిన ఆయుధం కూడా లభ్యం కాలేదు.

మరోవైపు శ్రద్ధ తలపడేసిన చెరువు సమీపంలోని అడవిలో అనేక శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  మెహ్రౌలీ చెరువు నుంచి పంపుల ద్వారా నీటిని తోడే పనిని ప్రారంభించారు.  మృతురాలి తలను కనుగొనడానికి పోలీసులు డైవర్ల సహాయం కూడా తీసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

గత వారం రోజులుగా పోలీసులు మెహ్రౌలీ అడవుల నుండి కొన్ని ఎముకలను సేకరించారు. వీటిలో తొడ ఎముక, మణికట్టు, మోచేతి మధ్య ఉన్న ఎముక,  మోకాలి చిప్ప, పుర్రె, దవడ వంటివి ఉన్నట్లు చెబుతున్నారు. ఎముకలపై కొన్ని పదునైన ఆయుధాల గుర్తులు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

ఇవి శ్రద్ధవో కావో నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఇందులో భాగంగా డీఎన్‌ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని చెబుతున్నారు.

మరోవైపు మిగతా శరీర భాగాల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో గజ ఈతగాళ్లతో అందులోనూ వెతుకులాట సాగించారు.

ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్‌ అఫ్తాబ్‌ ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడినట్టు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News