ఊపిరి పీల్చుకుంటున్న ఢిల్లీ.. కొత్త నిర్ణ‌యాలివే!

Update: 2021-06-07 08:30 GMT
క‌రోనా సెకండ్ వేవ్ తో విల‌విల్లాడిపోయిన రాష్ట్రాల్లో ఢిల్లీది ప్ర‌థ‌మ స్థానం. ఆక్సీజ‌న కొర‌త‌తో ఊపిరి అంద‌క ఎంతో మంది అభాగ్యులు క‌న్నుమూశారు. ప‌తాక స్థాయికి చేరిన మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌.. ప్ర‌తి ఒక్క‌రినీ బెంబేలెత్తించింది. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితి చ‌క్క‌బడుతోంది. కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. అక్క‌డ రోజువారీ కేసులు 400 దిగువ‌న న‌మోద‌వుతున్నాయి. దీంతో.. అన్ లాక్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టింది కేజ్రీవాల్ స‌ర్కారు.

సెకండ్ వేవ్ బాధ్య‌త‌ను రాష్ట్రాల‌కే వ‌దిలిపెట్టేసింది కేంద్రం. దీంతో.. చాలా రాష్ట్రాలు త‌మ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకున్నాయి. అయితే.. ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ విధించిన‌ప్ప‌టికీ.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూడా స‌రిచూసుకోవాల్సిన ప‌రిస్థితి. కొవిడ్ వ్యాప్తి నిరోధం పేరుతో దీర్ఘ‌కాలిక‌ లాక్ డౌన్ అమ‌లు చేస్తే.. ఖ‌జానాకు తీవ్ర న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే చాలా న‌ష్టం జ‌రిగిన నేపథ్యంలో.. స‌డ‌లింపు, పొడిగింపు ప‌ద్ధ‌తిని పాటిస్తున్నాయి.

ఢిల్లీలో చాలా కాలం క‌ఠిన లాక్ డౌన్ అమ‌లు చేసిన ప్ర‌భుత్వం.. స‌డ‌లింపు ప్ర‌క్రియ మొద‌లు పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో ఒక రోజున‌.. మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌రొక రోజున దుకాణాలు తెరుచుకోవాల‌ని ఆదేశించింది. అదే స‌మ‌యంలో ఓపెన్ చేసే వేళ‌లు కూడా మార్చింది. ఈ కొత్త నిర్ణ‌యాలు అమ‌లు చేస్తూనే.. లాక్ డౌన్ అమ‌లును జూన్ 14 వ‌ర‌కు పొడిగిస్తూ మ‌రోసారి నిర్ణ‌యం తీసుకుంది.

కొత్త రూల్ ప్రకారం.. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు దుకాణాలు తెరుచుకుంటాయి. కొవిడ్ నిబంధ‌న‌లు మాత్రం ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా పాటించాలి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు మాత్రం 50 శాతం సిబ్బందితోనే ప‌నిచేయాలి. మెట్రో సేవ‌ల‌కు సైతం అనుమ‌తి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది ప్ర‌భుత్వం. అయితే.. 50 శాతం ఆక్యుపెన్సీని క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌క‌టించింది.




Tags:    

Similar News