బ్రిటన్ ను వణికిస్తున్న డెల్టా వేరియంట్.. ఎందుకంత ప్రమాదకరమంటే..?

Update: 2021-06-20 12:30 GMT
కరోనా మహమ్మారి వివిధ రూపాలుగా మ్యూటేట్ అవుతూ పంజా విసురుతోంది. ఇప్పటికే చాలా రకాల వైరస్ స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. భారత్ లో తొలిసారిగా గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది. దీనికి మరో పేరు బి.1.617.2 రకం. బ్రిటన్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. జూన్ 21న నిబంధనలు సడలించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా మరోసారి ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇతర వేరియంట్లతో పోలిస్తే సార్స్-కోవి-2 డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చడానికి రెండు కారణాలు ఉన్నాయని ఫార్మాసూటికల్ నిపుణుడు సామ్ ఫజెలి అన్నారు. బ్రిటన్ లో ఇప్పటికే కనుగొన్న ఆల్ఫా రకంతో పోల్చితే ఇది 40 శాతం పరివర్తన చెందుతోందని ఆయన తెలిపారు. తొలి వైరస్ కంటే 50 శాతం కన్నా ఎక్కువగా మారుతోందని పేర్కొన్నారు. ఆల్ఫా వైరస్ కంటే ప్రమాదకారి అని అభిప్రాయపడ్డారు. అందుకే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు.

బ్రిటన్ లో ఏప్రిల్ లో 1 శాతం ఉన్న డెల్టా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయన్నారు. మే నెల మధ్య నాటికి నమోదైన కేసుల్లో 70 శాతం ఈ రకానికి చెందినవేనని పేర్కొన్నారు. ఈ వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీనిపై వ్యాక్సిన్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తొలి డోసు తీసుకున్న వారికి 30 శాతం రక్షణ ఉందని తెలిపారు. ఫైజర్ రెండు డోసులు పూర్తయితే 88 శాతం, ఆస్ట్రాజెనికా 60 శాతం రక్షణ కల్పిస్తుందని అంచనా వేశారు. వ్యాక్సిన్లతో కొంత తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు.

బ్రిటన్ లో డెల్టా వైరస్ తీవ్రత ఇప్పటికే తీవ్రరూపం దాల్చిందని అన్నారు. ఆ దేశంలో 42శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినా లాక్ డౌన్ సడలించడం వల్ల ఈ స్ట్రెయిన్ అధికమైందని పేర్కొన్నారు. మరికొన్నాళ్లు ఆంక్షలు విధించాలని అభిప్రాయపడ్డారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు ఇవ్వడం, పరీక్షల సంఖ్య పెంచడం, జన్యు పరమైన విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.




Tags:    

Similar News