ఈ నేతకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయిందే

Update: 2020-12-09 12:35 GMT
ఒక్కోసారి ఒక్కో నేతకు కాలం భలే కలిసొస్తుంది. అటువంటి నేతల్లో తెలంగాణాలోని సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కూడా ఒకరు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల చేతిలో జానారెడ్డి ఓడిపోయారు. అప్పటి నుండి జానారెడ్డి రాజకీయాల్లో పెద్దగా యాక్టివగ్ లేరనే చెప్పాలి. ఏదో గాందీభవన్లో సమావేశాలకో లేకపోతే అధిష్టానం నుండి పరిశీలకులు వచ్చినపుడో తప్ప ఇతరత్రా కలవటమే మానేశారు.

ఇటువంటి జానారెడ్డికి నర్సింహయ్య చనిపోవటంతో విచిత్రంగా ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరిగిన డిమాండ్ కూడా కాంగ్రెస్ లో నుండి కాదు. తమ పార్టీ తరపున పోటీ చేయమంటే కాదు తమ పార్టీ తరపునే పోటీ చేయాలంటు అధికార టీఆర్ఎస్, మంచి ఊపుమీదున్న బీజేపీల నుండి ఒత్తిడి పెరిగిపోతోందట. కాంగ్రెస్ నేతను తమ పార్టీలోకి లాక్కోవాలని పై రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేయటం విచిత్రం కాకపోతే ఇంకేమిటి చెప్పండి ?

నిజానికి జానారెడ్డంతటి నేత టీఆర్ఎస్ లో లేకకాదు. అయినా ఎందుకనో కేసీయార్ దృష్టి ఈ సీనియర్ కాంగ్రెస్ నేతపై పడింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పడిన దెబ్బ కేసీయార్ పైన బాగానే ప్రభావం చూపినట్లుంది. అందుకనే నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలో ఎటువంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదట. అందుకనే జానారెడ్డి లాంటి గట్టి నేతను పార్టీ తరపున పోటీకి దింపితే గెలుపు ఖాయమని కేసీయార్ భావనగా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఇటువంటి వ్యూహంతోనే పావులు కదుపుతోంది.

వరుసగా రెండు విజయాలతో మంచి ఊపుమీదున్న తమ పార్టీ తరపున జానారెడ్డి పోటీ చేస్తే మూడో గెలుపు కూడా తమదే అన్నట్లుగా కమలం నేతలు ధీమాతో ఉన్నారు. మరి డిమాండ్ సప్లై సూత్రమే ప్రపంచంలో నడుస్తోందన్న విషయం జానారెడ్డికి తెలీకుండా ఉంటుందా ? అందుకనే తనవెంట పడిన రెండు పార్టీల ముందు జానారెడ్డి పెద్ద డిమాండ్లనే ఉంచారట. తాను పోటీకి దూరంగా ఉండే పక్షంలో ఆయన కొడుకు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తామని బీజేపీ రాయబారం నడుపుతోందని సమాచారం. అయితే జానారెడ్డి మాత్రం ఎక్కడా తొందరపడటం లేదు.

పైగా రెండు పార్టీల నేతల ముందు తన డిమాండ్లను ఉంచారట. రెండు పార్టీలకు ఈ మాజీ మంత్రి పెట్టిన డిమాండ్లు ఏమిటంటే టీఆర్ఎస్ తరపున తన కొడుకును పోటీ చేయిస్తే తనకు రాజ్యసభ టికెట్ కావాలని కేసీయార్ కు కబురు పంపారట. ఇదే పద్దతిలో బీజేపీ నేతలకు కూడా కబురు పెట్టారట. అదేమిటంటే తన కొడుకు ఎంఎల్ఏగా పోటీ చేస్తే తనకు ఏదో ఓ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని. జానా డిమాండ్లు విన్న రెండు పార్టీల నేతలు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు ఫీలయ్యారట. జానారెడ్డి పెట్టిన డిమాండ్లు చూసిన తర్వాత అసలు ఆయనకు పార్టీ మారే ఆలోచనుందా లేదా అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు.
Tags:    

Similar News