పాత నోట్ల డిపాజిట్లపై షాకింగ్ నిర్ణయం

Update: 2016-12-19 09:44 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ లో భాగంగా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఎప్పటికప్పుడు తమ నిర్ణయాల్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల డిపాజిట్లు మొదలు.. బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకునే మొత్తం కావొచ్చు.. పాత నోట్లను మార్చుకునే విషయం కావొచ్చు.. చాలానే మార్పులు చేర్పులు చేశారు.

ఒకదశలో అయితే.. ఏ నిమిషాన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలీని పరిస్థితి నెలకొంది. అక్రమార్కుల స్పందనకు తగినట్లుగా ప్రభుత్వం తన నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని.. పెద్దనోట్ల రద్దుతో జరిగే మేలు పక్కదారి పట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకుందని చెప్పాలి. తాజాగా అలాంటిదే మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.

దేశ ప్రజలు తమ దగ్గరున్న రద్దు అయిన పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రూ.5వేలకు మించిన మొత్తాన్ని ఒక ఖాతాదారుడు ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసుకునే వీలుంది. అంటే.. ఈ నెల 30వ తేదీ లోపు.. ఎవరైనా సరే తమ దగ్గర ఉన్న పాత నోట్లను రూ.5వేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారే డిపాజిట్ చేసే వీలుంది. రూ.5 వేల కంటే తక్కువ మొత్తం మీద మాత్రం పరిమితులు విధించలేదు.

తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే.. అర్థమయ్యేదేమిటంటే.. ప్రభుత్వం ప్రతి ఖాతాలో రూ.2.5 లక్షల కంటే మించి డిపాజిట్ చేసిన మొత్తంపై ఐటీ శాఖ నజర్ ఉంటుందని ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు రూ.2 లక్షలు లేదంటే అంతకంటే కాస్త తక్కువ మొత్తాన్ని (రెండు లక్షల రూపాయిల లోపు) మొత్తాన్ని కమిషన్ బేసిస్ లో తీసుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. అలాంటి వాటికి అవకాశం లేకుండా పోతుందని చెప్పొచ్చు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేసే వారికి చుక్కలు కనిపించటం ఖాయమనే చెప్పాలి.

అంతే కాదు. ఐదు వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఇది వరకే ఆ సొమ్మును ఎందుకు డిపాజిట్ చేయలేదో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ పత్రాన్ని సమర్పిస్తేనే రూ. 50వేలకు కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. 

ఇదొక్కటే కాదు వేరేవాళ్ల ఖాతాల్లో  డబ్బు డిపాజిట్ చేయడంపైనా కొత్త ఆంక్ష తీసుకొచ్చింది ఆర్బీఐ. థర్డ్ పార్టీ ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేయాలంటే సదరు ఖాతాదారుడి నుంచి అనుమతి తీసుకున్నట్టుగా ఆధారం చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త జమ చేసేవారంతా బినామీలు అన్నది కేంద్రం ఉద్దేశం.. అందుకే కొత్తగా ఈ రూలు తీసుకొచ్చింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News