ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్: ఎలా, ఎందుకు, ఎప్పుడు… పూర్తి వివరాలివే!

Update: 2023-06-15 14:58 GMT
విశాఖలో జరిగిన ఎంపీ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం ఏర్పడింది. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబీకులు కిడ్నాప్ కు గురయ్యారు. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ)తోపాటు, ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్ కిడ్నాప్ కు గురయ్యారు. జీవీ వృత్తిరీత్యా ఆడిటర్‌ కాగా వైసీపీలో కీలక నేతగా కూడా ఉన్నారు. ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ హైదరాబాద్ లో ఉన్నారు.

కిడ్నాప్ ఎలా జరిగింది:

ముందుగా ఎంపీ కుమారుడు శరత్ ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఆనందపురంలో ప్రత్యేకంగా నివాసముంటున్న సమయంలో ఎంపీ కుమారుడిని కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సమయంలో అతడిని కట్టి పాడేసిన కిడ్నాపర్ లు… ఎవరు ఫోన్ చేసినా ఏమీ జరగనట్లుగా అతడిని బెదిరించి మాట్లాడించారంట.

ఈ సమయంలో మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని, డబ్బులు తీసుకురావాలని, కానిపక్షంలో చంపేస్తామని కిడ్నాపర్ లు బెదిరించారట. దీంతో డబ్బులు తీసుకుని ఆమె కిడ్నాపర్ లు పంపిన లొకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది.అయితే అలా డబ్బులు తీసుకెళ్లిన ఎంపీ భార్యను సైతం కిడ్నాప్ చేశారు దుండగులు. అనంతరం ఎంపీ కుటుంబ ఆడిటర్ గా ఉంటూ, ఆ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఉండే ఆడిటర్ జీవీకి ఫోన్ చేశారు. దీంతో కొంత డబ్బు తీసుకున్న జీవీ... కిడ్నాపర్ లు పంపిన లొకేషన్ కు వెళ్లారు. దీంతో... జీవీని కూడా కిడ్నాపర్ లు అదుపులోకి తీసుకున్నారు.

అయితే బుదవారం మధ్యాహ్నం నుంచి తన ఆడిటర్ అందుబాటులోకి రాకపోవడంతో ఎంపీ కి అనుమానం వచ్చిందని తెలుస్తుంది. ఇదే సమయంలో తన కుమారుడు ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి, తన భార్య గొంతులో వినిపిస్తున్న ఆందోళన, తమ ఆడిటర్ అందుబాటులోలేని వైనం… ఇవన్నీ ఎంపీ అనుమానాన్ని మరింత బలపరిచినట్లు తెలుస్తుంది. దీంతో ఈ రోజు ఉదయం ఎంపీ… విశాఖ సీపీ కి సమాచారం అందించారని సమాచారం.

కిడ్నాప్ ఎందుకు జరిగింది:

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం... ఇది పూర్తిగా డబ్బుల కోసం జరిగిన కిడ్నాప్ అని తెలుస్తుంది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ హేమంత్ గా గురించారు. వీరిని పద్మనాభం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అదుపులోకి తీసుకున్నారు.

ఎవరీ రౌడీ షీటర్ హేమంత్:

ఎంపీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ కి గతంలో తీవ్రమైన నేర చరిత్ర ఉందని తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్పొరేటర్ గా ఉన్న విజయశ్రీ రెడ్డి హత్య కేసులో కూడా ఇతని పేరు వినిపించింది అని అంటున్నారు . ఇదే సమయంలో అనేక బ్లాక్ మెయిలింగ్-కిడ్నాప్ కేసుల్లో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఠాలను ఏర్పాటు చేసుకోవడం, అనంతరం భారీ స్థాయిలో బెదిరింపులకు, దోపిడీలకూ పాల్పడటం చేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు! గతంలో పలు  కేసుల్లో ఇతను ప్రధాన ముద్దాయిగా ఉండటంతో... పోలీసులు ఈ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారన్ని చాలా జాగ్రత్తగా టాకిల్ చేసినట్లు సమాచారం.

ఎంపీ ఎంవీవీ ఏమన్నారు?:

తన కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయ్యారని తెలుసుకున్న అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్న ఎంపీ ఎంవీవీ స్పందించారు. తన భార్య, కుమారుడు కిడ్నాప్ అయిన మాట వాస్తమే అని, అయితే ఇప్పుడు వారు వైజాగ్ లోనే దొరికారని తెలిపారు. అయితే ఎంపీ విశాఖకు చేరుకున్న అనంతరం పూర్తి వివరాలు వెళ్లడించే అవకాశం ఉంది!

విశాఖ పోలీస్ కమిషనర్ కన్ క్లూజన్:

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై తాజాగా స్పందించారు విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రం వర్మ. తమకు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ మేరకు సమాచారం వచ్చిందని తెలిపారు. ముందుగా జీవీ కిడ్నాప్ అయినట్లు తమకు తెలిసిందని సీపీ అన్నారు. దీంతో జీవీని కాంటాక్ట్ చేసిన సమయంలో ఆయన ఫోన్ లో అందుబాటులోకి వచ్చారని.. తాను శ్రీకాకుళం నుంచి వస్తున్నట్లు చెప్పారని సీపీ తెలిపారు.

దీంతో తమకు అనుమానం వచ్చిందని.. అందుకు కారణం ఆయనను బలవంతంగా మాట్లాడిస్తున్నట్లు అనిపించిందని సీపీ స్పష్టం చేశారు. దీంతో మొత్తం టీంస్ ని అలర్ట్ చేశామని, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించుకున్నట్లు సీపీ తెలిపారు. అయితే వారి టెక్నికల్ ఎవిడెన్స్ ని బట్టి జీవీ రిషికొండ ప్రాంతంలో ఉన్నట్లు కనిపించిందని సీపీ అన్నారు. దాన్నిబట్టి వారంతా కారులో ఉన్నారని ఐడెంటిఫై చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సమయంలో వారి కదలికలపై పూర్తి దృష్టి సారించిన తమకు ఉదయం 11 గంటల సమయంలో అక్కడక్కడే తిరుగుతున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. అనంతరం 11:30 గంటల ప్రాంతంలో జీవీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం... "రాత్రి సుమారు ఒక కోటి రూపాయలు డెలివరీ చేశారు" అని తమకు తెలిపాడని సీపీ అన్నారు. దీంతో డబ్బుకోసం కిడ్నాప్ జరిగిందనే విషయం తమకు అర్ధమయ్యిందని సీపీ స్పష్టం చేశారు.

సరిగ్గా అదే సమయానికి జీవీ ఉన్న కారులోనే ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసిందని సీపీ తెలిపారు. అయితే అప్పటికే ఫీల్డ్ లో ఉన్న టీంస్ మొత్తం వారు ప్రయాణిస్తున్న కారుని ట్రక్ చేసుకుంటూ పోయినట్లుల్ సీపీ చెప్పారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఆనందనగర్ - పద్మనాభపురం ఏరియాల్లోకి వెళ్లిందని అన్నారు.

ఈ సమయంలో ఎంపీ కుమారుడి కారును గుర్తించిన పోలీసులు చేజ్ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమయంలో ఆపోజిట్ లో కూడా ఒక పోలీస్ టీం రావడం, అయినప్పటికీ కిడ్నాపర్ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఎదురుగా పద్మనాభం సీఐ వెహికల్, వెనక మరో సీఐ వెహికల్ రావడంతో కంగారు పడిన కిడ్నాపర్ పోలీస్ జీప్ ని నేరుగా వెళ్లి ఢీకొన్నాడని, ఫలితంగా అందులోని పోలీసులు గాయపడ్డారని సీపీ తెలిపారు.

ఈ ప్రమాదంలో కిడ్నాపర్ ప్రయాణిస్తున్న ఆడికారు టైర్స్ ఊడిపోయాయని సీపీ తెలిపారు. ఆ సమయంలో కిడ్నాపర్ లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరు నిందితులను చేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారని సీపీ స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ కుటుంబ సభ్యులు, జీవీ గురించి అడగా... వారిని హైవే దగ్గర గల సర్వే చెట్ల పరిశరాల్లో దింపినట్లు కిడ్నాపర్ తెలిపాడు. దీంతో మరో టీం వెళ్లి కిడ్నాపైన ముగ్గిరిని సేవ్ చేశారని... వారితో తాను ఇంకా మాట్లాడలేదని సీపీ క్లారిటీ ఇచ్చారు.

కొసమెరుపు:

అయితే పోలీసులకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది పూర్తిగా డబ్బుల కోసం మాత్రమే చేసిన కిడ్నాప్ అని తెలుస్తుంది. అయితే... ఇది నిజంగా డబ్బుల కోసం జరిగిన కిడ్నాపేనా... లేక దీని వెనక మరింత లోతైన కథ ఉందా అనేది తెలియాల్సి ఉంది! 

Similar News