వరం దక్కినా సుఖం దక్కని టాప్ పొలిటికల్ ఫ్యామిలీ!

Update: 2019-07-22 07:01 GMT
ఎవ‌రైనా..ప‌ద‌వులు రాక‌పోతే ఇబ్బంది ప‌డ‌తారు. కానీ ప‌ద‌వులు వ‌చ్చినా ఇబ్బంది ప‌డ‌తారా?అంటే ప‌డ‌తారు. గ‌తంలో ఇబ్బంది ప‌డ్డారు...ఇప్పుడు అలాగే ఇబ్బంది ప‌డుతున్నారు కూడా. అది కూడా ఆషామాషీ ప‌ద‌వుల‌తో కాదు.. ప్ర‌ధాన‌మంత్రి - ముఖ్య‌మంత్రి వంటి కీల‌క ప‌ద‌వులు రావ‌డం వ‌ల్ల‌! ఆశ్చ‌ర్య‌పోకండి. నిజంగా నిజం. ఇలా ఇబ్బంది ప‌డుతున్న‌ది ఎవ‌రో తెలుసా? క‌ర్ణాట‌కకు చెందిన దేవేగౌడ కుటుంబం. గౌడ కుటుంబం ఎప్పుడూ పూర్తి కాలం అధికారంలో కొనసాగలేదనే అభిప్రాయాన్ని ఆ రాష్ట్ర నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తండ్రి దేవేగౌడ‌ - కుమారుడు కుమార‌స్వామి ప‌రిస్థితిని గ‌మ‌నించిన వారు ఈ మాట చెప్తున్నారు.

అధికార పార్టీలో భాగ‌స్వామ్య‌మైన ఎమ్మెల్యేలు త‌మ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డంతో క‌ర్ణాట‌క సంక్షోభం తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే.ఈ ఎపిసోడ్‌ తో కుమార‌స్వామి ప‌ద‌విపోనుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఆయ‌న తండ్రి సైతం ఇదే రీతిలో ఇబ్బందుల పాల‌య్యారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలువగా కాంగ్రెస్‌ 140 సీట్లకే పరిమితమైంది. పలు పార్టీల అగ్రనేతలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా దక్షిణాది నుంచి రెండో ప్రధానిగా జేడీఎస్‌ కి చెందిన దేవెగౌడ జూన్‌ 1న ప్రమాణస్వీకారం చేశారు. 11 నెలలకే ఆ పదవిని కోల్పోయారు. ఆయన కుమారుడు కుమారస్వామి ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2018 కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్‌ 80 సీట్లకే పరిమితమైంది. 37 స్థానాల్లో గెలిచిన జేడీఎస్‌ అనూహ్యంగా కాంగ్రెస్‌ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తండ్రి మాదిరిగానే కుమారస్వామి 13 నెలల పాలనలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నారు.

తాజాగా కర్ణాటక మాజీ సీఎం - బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని ఆయ‌న అన్నారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ - సీఎం కుమారస్వామి - కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కూడా బలపరీక్షను సోమవారం ఎదుర్కొంటామని చెప్పారని, దీంతో ఈరోజుతో అంతా ముగుస్తుందని తనకు వంద శాతం నమ్మకం ఉన్నదన్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుపై బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆ పార్టీలు జారీ చేసిన విప్‌ కు విలువ లేదన్నారు.

కాగా, రెబల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలను సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. సీఎంను మార్చుతామని రాయబారం పంపినా రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. ముంబైలోని ఓ హోటల్‌ లో మకాం వేసిన కాంగ్రెస్‌ - జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. డబ్బుల కోసం తాము ముంబైకి రాలేదని - కాంగ్రెస్‌-జేడీఎస్‌ వైఖరి పట్ల విసిగిపోయామని - ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే ముంబైకి వచ్చినట్లు వెల్లడించారు. సోమవారం అసెంబ్లీకి హాజరుకాబోమన్నారు.


Tags:    

Similar News