డీజీపీకి గవర్నర్ సాబ్ నుంచి పిలుపొచ్చింది

Update: 2016-02-04 06:31 GMT
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మజ్లిస్ రెచ్చిపోయిన తీరు.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. షబ్బీర్ ఆలీలపై జరిగిన దాడితో పాటు.. విపక్ష నేతలపై మజ్లిస్ నేతలపై చేసిన దాడి అంశం గవర్నర్ నరసింహన్ దృష్టికి వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణలో శాంతిభద్రతలు ఏ తీరులో ఉన్నాయో తాజా ఘటన తేల్చి చెబుతుందంటూ తెలంగాణ విపక్ష నేతలు గవర్నర్ కు విన్నవించటంతో పాటు.. సెక్షన్ 8ను అమలు చేయాలంటూ డిమాండ్ చేయటం తెలిసిందే.

ఈ ఘటనపై తెలంగాణ అధికారపక్షం ఇప్పటివరకూ పెద్దగా స్పందించింది లేదు. విపక్ష నేతలపై మజ్లిస్ నేతలు దాడి చేసిన వైనంపై ఒక్కరూ కూడా పెదవి విప్పలేదు. కాస్తోకూస్తో టీఆర్ ఎస్ ఎంపీ కవిత కాస్త మాట్లాడారు. అది మినహా మిగిలిన వారు ఎవరూ పట్టించుకున్నది కూడా లేదు. ఇదిలా ఉండగా.. విపక్ష నేతలపై మజ్లిస్ నేతల దాడిపై గవర్నర్ సీరియస్ అయ్యారని చెబుతున్నారు.

జరిగిన ఘటనలపై వివరణ కోరేందుకు ఆయన తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కబురు పంపారు. ఈ ఉదయం 11.30 గంటలకు డీజీపీ గవర్నర్ తో భేటీ కానున్నారు. పాతబస్తీలో మజ్లిస్ రౌడీయిజంపై డీజీపీకి గవర్నర్ కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. అలాంటిదేమీ ఉందన్న మాట మరికొందరు చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News