చంద్రబాబు ఇంటికి కనీవినీ ఎరుగని భద్రత

Update: 2016-11-06 10:07 GMT
    ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి భారీ భద్రత కల్పించారు. ఇప్పటికే అక్కడ పటిష్టమైన భద్రత ఉండగా తాజాగా దాన్ని మరింత పెంచారు.  అదనంగా మరో 25 మంది సాయుధ సిబ్బందిని అక్కడ భద్రత వ్యవహారాలు చూసేందుకు నియమించారు. అంతేకాదు... ఇంటెలిజెన్స్ చీఫ్ తో కలిసి రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఈరోజు అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్... ఆ తరువాత మావోయిస్టలు హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబుకు వ్యక్తిగతంగా భద్రతను ఇప్పటికే భారీగా పెంచారు. దాంతో పాటు ఆయన నివాసం వద్ద కూడా చీమ కూడా దూరనంతంగా సాయుధులను మోహరించారు.

ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మావోయిస్టులు ఆయుధాలు కలిగి ఉంటామంటే కుదరని అన్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే తమ అదుపులో లేరని కోర్టుకు తెలిపామని చెప్పిన ఆయన  ప్రతీకారం తీర్చుకోవడమనేది మావోయిస్టుల పంథా కాబట్టి వారి ఆటలు సాగనివ్వకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. మావోయిస్టులను చర్చలకు రమ్మని పలుసార్లు ఆహ్వానించినా వారి నుంచి స్పందన లేదని అన్నారు.

ఏవోబీలో కూంబింగ్ నిలిపివేసి వారం రోజులు అవుతోందని, రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తులందరికీ మరింత భద్రత పెంచామని అన్నారు.  పోలీసులపై బురదజల్లడం మావోయిస్టులకు అలవాటైపోయిందని, ఇందుకు నిదర్శనం మావోయిస్టు అగ్రనేత ఆర్కే విషయంలో తమపై వారు చేసిన ఆరోపణలేనని అన్నారు. గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News