ఆ విషయం కూడా చెప్పించుకోవాలా ధోనీ?

Update: 2016-04-23 09:21 GMT
ప్రముఖుల మీద అందరి కన్ను ఉంటుంది. వారే చిన్న తప్పు చేసినా అదో పెద్ద వివాదం అవుతుంది. ప్రముఖులన్న వారికి ఈ తిప్పలు తప్పవు. ఇలాంటి సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. కానీ.. ధోని లాంటి వారు వరుస తప్పులు చేసి అడ్డంగా బుక్ అయిపోతుంటారు. మొన్నామధ్య ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలితో జత కట్టటం.. సదరు సంస్థ తీరు వివాదాస్పదం కావటంతో దాని నుంచి బయటకు వచ్చేశారు. పెద్ద ఎత్తున ఆదాయం పోయినా.. విమర్శల నుంచి తప్పించుకోగలిగారు.

తాజాగా ధోనీ మరో వివాదంలో కూరుకుపోయారు. దేశ వ్యాప్తంగా నీటి కొరత భారీగా ఉన్న వేళ.. నీటి వృధాపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. భారీగా నీటిని వినియోగించాల్సి ఉంటుందన్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్ లకు నో చెప్పటం తెలిసిందే. నీటి వినియోగం మీద అవగాహన పెరగటమే కాదు.. ఎవరైనా నీటిని వృధాచేస్తుంటే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.

చివరకు వీవీఐపీలు హెలికాఫ్టర్ల వినియోగం మీద కూడా కామెంట్లు వస్తున్నాయి. హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్య సమయంలో  దుమ్ము రేగకుండా నీటిని వినియోగించటం.. దీనిపై పలు వర్గాలు మండిపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ ధోనీ తన ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కోసం భారీగా నీటిని వృధా చేస్తున్నారన్నది తాజా ఆరోపణ.

రాంచీలోని తన ఇంట్లో ఉన్నస్విమ్మింగ్ కోసం ధోనీ రోజూ 15 వేల లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఓపక్క దేశ వ్యాప్తంగా నీటి  కోసం కటకటలాడుతున్న వేళ.. విలాసాల కోసం వేలాది లీటర్ల నీటిని వృధాచేయటంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి అంశాల్లో ధోనీ కానీ జాగ్రత్తగా లేకుంటే అతగాడి ఇమేజ్ భారీగా డ్యామేజ్ కావటం గ్యారెంటీ.

Tags:    

Similar News