కేసీఆర్ కు ఎల్ అండ్ టీ అలాంటి లేఖ రాసిందా?

Update: 2020-06-25 04:30 GMT
ఊహించని విధంగా దెబ్బేసిన మహమ్మారితో ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే.. మరో మూడు.. నాలుగు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ఇప్పుడు వచ్చి పడిన సంక్షోభం అలా వచ్చి.. ఇలా పోయేదేమీ కాదని.. ప్రపంచ గతిని సమూలంగా మార్చే అవకాశాలే ఎక్కువన్న విషయంపై ఇప్పుటికే చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఈ కారణంతోనే.. మొన్నటివరకూ తమ వ్యాపారాలకు సంబంధించి వెయిట్ చేద్దామన్న ఆలోచన ఉన్నోళ్లు.. ఇప్పుడు విషయాన్ని తేల్చేసే పనిలో పడ్డారు. చిన్న సంస్థ నుంచి పెద్ద సంస్థల వరకూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఈ తరహా వాదనకు బలం చేకూరేలా తాజాగా వినిపిస్తున్న ఒక మాట తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరచర్చగా మారింది. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ ఒక లేఖ రాసినట్లు గా ప్రచారం సాగుతోంది. భారీ పెట్టు బడుల తో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ చేపట్టటం తెలిసిందే. ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కటం కాస్త ఆలస్యమైనా.. పరుగులు తీయటం మొదలైన తర్వాత స్పందన బాగుందన్న సంతోషం నెలకొంది. ఇలాంటి వేళ లోనే అనూహ్యం గా తెర మీదకు వచ్చిన మహమ్మారి పుణ్యమా అని లెక్కలు మారిపోయాయి.

గడిచిన మూడు నెలలుగా హైదరాబాద్ మెట్రో రైలు నడవని పరిస్థితి. రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. ఎప్పటికి పట్టాలు ఎక్కుతాయో కూడా తెలీని పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ముందుకు ఎల్ అండ్ టీ ముందుకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. లాక్ డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో తమకు జరిగిన నష్టాన్ని పరిహారం రూపంలో అందించాలని కోరినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రానప్పటికీ.. ఇలా లేఖ ఒకటి ప్రభుత్వానికి రాసినట్లుగా చెబుతున్నారు.

గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్ మెట్రోకు అయ్యే మొత్తంలో సింహభాగం ఎల్ అండ్ టీ భరించటం.. అందుకుగాను.. ప్రయాణికుల ఛార్జీలు.. వ్యాపార.. వాణిజ్య ప్రకటనలతో పాటు.. వాణిజ్య స్థలాలు.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో ఆదాయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ ఒప్పందం 35 ఏళ్ల పాటు ఉండనుంది. ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  తమ ఒప్పంద గడువును మరో 4-6 నెలల పాటు పెంచటం కానీ.. ఇప్పుడు నడుస్తున్న సమయానికి పరిహారం కాని అందజేయాలని కోరింది. హైదరాబాద్ లో మొత్తం 69 కి.మీ. మేర మెట్రో అందుబాటు లో ఉన్న విషయం తెలిసిందే. దీని కోసం ఎల్ అండ్ టీ సంస్థ సుమారు రూ.17వేల కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు చెబుతారు. మరి.. ఎల్ అండ్ టీ రాసిన లేఖ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
Tags:    

Similar News