గుట్టుగా చెన్నై కోర్టుకు సుజనా.. గంటలో బెయిల్ తో వెళ్లిపోయారా?

Update: 2021-12-05 04:32 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ.. పవర్ పోయినంతనే పార్టీ నుంచి జంప్ అయిపోయి బీజేపీ గూటికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగు చూసింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఒక కేసు విషయంలో కోర్టులోకు హాజరయ్యేందుకు చెన్నైకి రావటం.. గుట్టు చప్పుడు కాకుండా తిరిగి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ ఆయన కోర్టుకు హాజరయ్యేలా చేసిన సదరు కేసు ఏమిటి? అన్నది చూస్తే.. తప్పుడు పత్రాల్ని బ్యాంకులకు ఇచ్చి వందల కోట్ల రూపాయిల్ని రుణాలుగా పొంది ఎగవేసిన కేసును ఈడీ నమోదు చేసింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికి పలుమార్లు ఏదో ఒక కారణం చెప్పి గైర్హాజరు అయ్యారు వాస్తవానికి అక్టోబరు 29న ఇదే కేసులో ఆయన ఈడీ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ.. హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైకు వచ్చిన ఆయన.. శనివారం ఉదయం 11.20 గంటల వేళకు కోర్టుకు చేరుకున్నారు. తర్వాత గంట వ్యవధిలోనే ఆయన బెయిల్ పొంది కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. ప్రత్యేక అనుమతితో ఢిల్లీ నుంచి అత్యంత గోప్యంగా చెన్నైకు వచ్చిన సుజనా.. ఈడీ కోర్టుకు హాజరై.. తన వాదనలు వినిపించి బెయిల్ తీసుకొని బయటకు రావటం గమనార్హం. సాధారణంగా రాజకీయ ప్రముఖులు ఎవరైనా కోర్టుకు హాజరైనప్పుడు మీడియా హడావుడి ఉంటుంది. అందుకు భిన్నంగా సుజనా ఎపిసోడ్ చోటు చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News