ఆఖరుకు నేపాల్ కూడా భారత్ భూమిని కబ్జా చేసిందా?

Update: 2022-06-27 04:34 GMT
ఓవైపు పాకిస్తాన్.. మరో వైపు చైనా మన కశ్మీర్ ను సగం వరకూ ఆక్రమించేశాయి. చైనా అయితే ఇప్పటికీ మన భూభాగాలపై పేచీ పెడుతూ ముందుకు ముందుకు వస్తోంది. పాకిస్తాన్ అయితే 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ నామకరణం చేసి పాలిస్తోంది. ఈ రెండు దేశాలు చాలవన్నట్టు ఇప్పుడు మన పక్కనే ఉండే చిన్న దేశం 'నేపాల్' కూడా రెచ్చిపోతోంది. చడీచప్పుడు లేకుండా మరో దేశం 'నేపాల్' కూడా ఇండియా భూభాగాన్ని ఆక్రమించేస్తోంది. ఆక్రమించేసిన భూమి 5 హెక్టార్లే అయినా అసలు నేపాల్ కూడా భూకబ్జాకు పాల్పడడమే విచిత్రంగా ఉంది.

పాకిస్తాన్, చైనాతో అంటే మన దేశానికి విభజన నుంచి సమస్యలున్నాయి. చైనా చేతిలో భారత్ ఓడిపోవడంతో హిమలయాలపై ఆధిపత్యం చైనాకు వచ్చింది. ఇక పాకిస్తాన్ తో గెలిచినా కూడా మన దేశం 'పీవోకే'ని స్వాధీనం చేసుకోలేదు. వాళ్ల కబ్జా చేసిన భూమిని విడిపించలేదు. చర్చలంటూ కాలయాపన చేసింది. ఇప్పటికీ కూడా పీవోకే పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది.

ఇక ఇప్పుడు నేపాల్ కూడా మెళ్లిగా భారత భూమిని ఆక్రమించేస్తోంది. మంచి మిత్రదేశంగా ఉన్న నేపాల్ చైనా మాయలో పడి మనతో విభేదాలు కొనితెచ్చుకుంటోంది. నేపాల్ కు భారత్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా నేపాల్ కు ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేసిన చరిత్ర లేదు.

అయితే తాజాగా ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతంలో చంపావత్ అటవీ ప్రాంతంలోని భూమిని నేపాల్ ఆక్రమించినట్టు ఉత్తరాఖండ్ అటవీశాఖ గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది.

ఇదే విషయమై ఉత్తరాఖండ్ అటవీశాఖ మంత్రి సుబోధ్ ఉనియాల్ మాట్లాడుతూ కబ్జా నిజమేనని అన్నారు. ఈ విషయమై కేంద్రప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని కేంద్రం తెలిపింది.

మొత్తంగా చిన్న దేశమైన నేపాల్ కు కూడా భారత్ అలుసైపోయిందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మన భూమిని కబ్జా చేసేంత స్థాయికి నేపాల్ ఎదిగిందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News