మునుగోడు బ‌రిలో ష‌ర్మిల పార్టీకి అంత సీనుందా?

Update: 2022-08-27 08:30 GMT
తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌ధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌మ సిట్టింగ్ సీట‌యిన మునుగోడును గెలుచుకోవాల‌ని కాంగ్రెస్, వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల ముందు ఈ సీటును గెలుచుకుని ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని నిరూపించుకోవ‌డానికి టీఆర్ఎస్, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి త‌మ పార్టీలో చేర‌డంతో త‌మ స‌త్తా నిరూపించుకోవాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఆట‌లో అర‌టి పండులా వైఎస్ ష‌ర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా బ‌రిలోకి దిగుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

తన పుట్టినిల్లు ఆంధ్రా అయితే.. మెట్టినిల్లు తెలంగాణ అని.. తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ ష‌ర్మిల పార్టీ ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి వైఎస్సార్ బాట‌లో పాద‌యాత్ర చేస్తూ తెలంగాణ‌ను చుట్టేస్తున్నారు.. ష‌ర్మిల‌.

అయితే ఇంత‌వ‌ర‌కు ఒక్క‌రంటే ఒక్క పేరున్న నేత కూడా వైఎస్సార్టీపీలో చేర‌లేదు. పార్టీ ఏర్పాటు చేసిన కొత్త‌ల్లో వైఎస్సార్ అనుచ‌రులు ఒక‌రిద్ద‌రు చేరినా.. మ‌ళ్లీ కొద్ది రోజుల‌కే పార్టీ నుంచి వెళ్లిపోయారు. అయినా స‌రే ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తున్నా ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌టం లేద‌ని అంటున్నారు.

ఇప్పుడు మునుగోడులో ష‌ర్మిల పోటీ చేయ‌డం వ‌ల్ల ఒరిగేదేమీ లేద‌ని కూడా చెబుతున్నారు. అస‌లు ష‌ర్మిల పార్టీకి అంత సీన్ లేద‌ని అంటున్నారు. ఆ పార్టీలో జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాలు, గ్రామ క‌మిటీలు కూడా ఇప్ప‌టివ‌ర‌కు లేవ‌ని గుర్తు చేస్తున్నారు.

ఆమె త‌ప్ప ఒక్క పేరున్న నాయ‌కుడు కూడా లేర‌ని చెబుతున్నారు. అస‌లు ష‌ర్మిల పార్టీ ఏర్పాటు చేసిన కార‌ణ‌మే టీఆర్ఎస్ కు ల‌బ్ధి చేయ‌డం కోస‌మేన‌ని అప్ప‌ట్లోనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ‌లో అత్యంత బ‌ల‌మైన‌ రెడ్డి సామాజిక‌వ‌ర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీతో వెళ్ల‌కుండా ఉండ‌టానికి.. ఆ సామాజిక‌వ‌ర్గంలో చీలిక తేవ‌డానికి ష‌ర్మిలతో పార్టీ పెట్టించార‌ని.. త‌ద్వారా టీఆర్ఎస్ కు ల‌బ్ధి క‌లిగించ‌డ‌మే ఉద్దేశ‌మ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని.. తెలంగాణ ఉద్య‌మంలోనూ ష‌ర్మిల చేసిందేమీ లేద‌ని అంటున్నారు. ఇప్పుడు అధికారాన్ని చేజిక్కుంచుకోవాల‌ని.. రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని క‌ల్లిబొల్లి క‌బుర్లు చెబుతున్నా ఎవ‌రూ ఆమెను అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకోవ‌డం లేద‌ని పేర్కొంటున్నారు. మునుగోడులో పోటీ చేసినా డిపాజిట్ కూడా రాద‌ని నొక్కివ‌క్కాణిస్తున్నారు.
Tags:    

Similar News