సొంత ఆఫీసులపై టీడీపీ నేతలే దాడులు చేసుకున్నారా ?

Update: 2021-10-20 08:30 GMT
రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ అలాగనే చెప్పారు. మీడియాతో మాట్లాడిన భరత్ టీడీపీ ఆఫీసులపై ఆ పార్టీ నేతలే దాడులు చేసుకుని దానికి వైసీపీ నేతలు కారణమని ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. నిజానికి సొంతపార్టీ కార్యాలయాలపై టీడీపీ నేతలే ఎందుకు దాడులు చేసుకుంటారని మార్గాని ఆలోచించలేదు. గుంటూరు కార్యాలయంపై టీడీపీలోని ఒకవర్గం నేతలు పార్టీ పదవుల కేటాయింపు విషయంలో దాడి చేశారని సోషల్ మీడియాలో ఓ పోస్టు సర్క్యులేట్ అవుతోంది.

సరే టీడీపీలోని ఓ వర్గం నేతలు దాడులు చేసుకున్నారంటే అది వాళ్ళ సొంత విషయం. కాబట్టి ఆ విషయంలో రెండోవాళ్ళ జోక్యం అవసరంలేదు. మరి మిగిలిన ఆఫీసులపైన ఎవరు దాడి చేశారు ? టీడీపీ నేత పట్టాభి సీఎంను నోటికొచ్చినట్లు తిట్టినందుకు వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పట్టాభి సీఎంను తిట్టడమూ తప్పే వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడిచేయటమూ తప్పే అనటంలో సందేహంలేదు.

ఇక్కడ టీడీపీ, వైసీపీ నేతలు ఇద్దరు కూడా హద్దులుదాటే వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. సాక్ష్యాత్తు పిల్లనిచ్చిన మామ ఎన్టీయార్ పైనే చెప్పులేయించిన ఘనత చంద్రబాబునాయుడుకు ఉందన్న విషయం జనాలందరికీ తెలుసన్నారు. అంటే ఎన్టీయార్ పై చెప్పులేయించారు కాబట్టి ఇపుడు కూడా తమ కార్యాలయాలపై తమ నేతలతోనే చంద్రబాబు దాడులు చేయించారని చెప్పటమే భరత్ ఉద్దేశ్యంగా కనబబుతోంది. ఉనికి కోల్పోయిన టీడీపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్లాన్ చేసిందని ఆరోపించారు.

పట్టాభిని మురికిలో తిరిగే పందని తాము అనగలమని భరత్ చెప్పటం విచిత్రం. పట్టాభిని అనాల్సిన మాటలు అనేసి తాము అనగలమని అనటంలో భరత్ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావటంలేదు. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్లే సమస్య బాగా పెద్దదైపోతోంది. ఎదుటివాళ్ళకి సంస్కారం లేదని చెప్పాలంటే మాట్లాడేవాళ్ళు మాటల్లో సంస్కారం ఉండాలన్న చిన్న లాజిక్ ను భరత్ మరచిపోయారు. ఒకళ్ళపై మరొకళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల చివరకు శబ్దకాలుష్యం తప్ప ఇంకేమీ ఉండదని రెండుపార్టీల నేతలు గ్రహించాలి.


Tags:    

Similar News