గంటా పాలిటిక్స్ ఎండ్ కి వచ్చేసిందా... ?

Update: 2021-07-13 03:09 GMT
విశాఖ జిల్లాలో చెప్పుకోదగిన నాయకుడిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అరంగేట్రం చేసిన గంటా 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలించేంతవరకూ ఓటమి లేకుండా కధ నడిపారు. ఏకంగా ఏడేళ్ల పాటు కాంగ్రెస్, టీడీపీలలో మంత్రిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం టీడీపీ ఓడిపోవడంతో గంటా కూడా సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు పోరాటంలో గతంలో పాలుపంచుకున్న ఇపుడు సైలెంట్ అయ్యారు. ఆయన రాజీనామా కూడా స్పీకర్ తమ్మినేని సీతారామ్  దగ్గర భద్రంగా ఉంది. ఓ వైపు రాష్ట్రంలో రాజ‌కీయం అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రావ‌ణ‌కాష్టంలా మండుతోంది.

గంటా కనీసం మీడియా ముందుకు రావడంలేదు. ఆయన ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. రెండేళ్ల క్రితం విశాఖ జిల్లా రాజకీయం అంతా తానే అంటూ చక్రం తిప్పిన గంటా ఇలా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోవడం మాత్రం అనుచరులకు అసలు నచ్చడంలేదు. ఇక ఆయన విశాఖ నార్త్ నుంచి మళ్లీ పోటీ చేయరు అంటున్నారు. ఆయన భీమిలీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటే అక్కడ లోకేష్ పోటీ చేస్తారు అన్న మాట అయితే వినిపిస్తోంది. దాంతో గంటాకు ఎక్కడా ఛాన్స్ లేని సీన్ టీడీపీలో అయితే ఉంది. ఇక విశాఖ ఎంపీగా గతంలో పోటీ చేయమని గంటాను చంద్రబాబు కోరారు. కానీ ఇపుడు ఆయన ఆ అవకాశం అసలు ఇవ్వరు అంటున్నారు.

మరో వైపు టీడీపీలో లోకేష్ ప్రాబల్యం పెరగడం, ఆయన జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సన్నిహితుడిగా ఉండడంతో గంటాకు టీడీపీలో బాగానే ఉక్క బోతగా ఉందిట. లోకేష్‌ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జిల్లాలో త‌న టీంను సెట్ రైట్ చేసుకుంటున్నారు. చింత‌కాయ‌ల అయ్య‌న్న వార‌సుడు, బండారు వార‌సులు, అటు త‌న తోడ‌ళ్లుడు భ‌ర‌త్‌, కిడారి శ్ర‌వ‌ణ్ లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అస‌లు గంటాను లోకేష్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. రేపటి రోజున గంటా టీడీపీలో కొనసాగాలి అంటే కచ్చితంగా లోకేష్ ప్రాపకం సంపాదించాలి. ఇప్పటిదాకా లోకేష్ మీద ఒక్క మంచి మాట కూడా మాట్లాడని గంటా అలా చేస్తారా అంటే డౌటే మరి.

కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఆయన అలా చేసినా కూడా లోకేష్ పట్టించుకుంటారా ? అన్నది కూడా మరో చర్చ. ఇక గంటా అనుచరులు చాలా మంది వైసీపీలో చేరిపోయారు. కొందరు టీడీపీలో సర్దుకున్నారు. గంటా మాత్రం ఒంటరి అయ్యారు. మునుపటిలా ఆయన రాజకీయ జోరు లేదనే అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో గంటా ఏం చేయబోతారో. వచ్చే ఎన్నికల నాటికి 64 ఏళ్ల వయసు గంటాకు వస్తుంది. ఇక మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్. ఆ ఎన్నికల్లో గంటా కనుక తన కెరీర్ సెట్ చేసుకోకపోతే  పొలిటికల్ గా ఎండ్ అయినట్లే అన్న మాట అయితే ఉంది.
Tags:    

Similar News